JANASENA: విద్యా కానుక పేరుతో జగన్‌ ప్రభుత్వ దోపిడి

JANASENA: విద్యా కానుక పేరుతో జగన్‌ ప్రభుత్వ దోపిడి
సాక్ష్యాధారాలతో ఆరోపించిన నాదెండ్ల మనోహర్‌... చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

వైసీపీ ప్రభుత్వం విద్యాకానుక పేరుతో 120 కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని జనసేన పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలో జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్‌ జరిగిందని మనోహర్‌ ఆరోపించారు. నిధులను మళ్లించి నాడు-నేడు పేరిట ప్రజల్ని మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయటపెడతామని మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా విద్యా శాఖలో స్కామ్ ను బహిర్గతం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని, అందులో కుంభకోణం జరిగిందన్నారు.


మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్‌ మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్‌ కొనుగోలు చేశారని, 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారని... ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి రూ.2400 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. టెండర్‌ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడ్డాయని, నిధులు దారి మళ్లినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలిందని... విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని మనోహర్‌ ఆరోపించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్లు దారి మళ్ళాయని ఇటీవల ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 5 కంపెనీలపై దాడులు చేసిందన్నారు. ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్ లో డొంక కదిలిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనలో అవినీతిని ఆధారాలతో నిరూపిస్తున్నామని.. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయబోమని, అవినీతిపై విచారణ జరిపి సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని నాదెండ్ల డిమాండ్‌ చేశారు. నిధులు ఎలా దారి మళ్ళాయి అనేదానిపై ఈడీ సమగ్ర విచారణ మొదలుపెట్టిందని.. 5 కంపెనీలు సిండికేట్ గా మారాయి అనేది అర్థం అవుతోందన్నారు. విద్యార్థులకు నాసిరకం బూట్లు, చిరిగిపోతున్న బ్యాగులు ఇస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు లాలూచీపడ్డారు. ఇప్పటి వరకూ జగనన్న విద్యా కానుక పేరుతో రూ.2400 కోట్లు నిధులు వెచ్చించారని గుర్తు చేశారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరు ఉన్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

టోఫెల్‌, పాలవెల్లువ పథకంలో అవినీతిని జనసేన బయటపెట్టిందని, విద్యాశాఖలో జరిగిన అవినీతిని బయటకు తెస్తున్నామని, జగనన్న విద్యాకానుక పేరుతో ప్రవేశపెట్టిన కిట్స్‌లోనూ అవినీతి జరిగిందని నాదెండ్ల ఆరోపించారు. పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కానీ జగనన్న విద్యా కానుకకు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది 42 లక్షలన్నారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్ పేద విద్యార్థుల పేరుతో కోట్లు మళ్లిస్తున్నారని, పేద విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story