YS Vivekananda Reddy: వివేకా హత్యకేసులో అనుమానితుడిగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి..

YS Vivekananda Reddy: వివేకా హత్యకేసులో అనుమానితుడిగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి..
YS Vivekananda Reddy: వివేకా హత్యకేసులో వైసీపీ కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అనుమానితుడిగా చేర్చింది సీబీఐ.

YS Vivekananda Reddy: వివేకా హత్యకేసులో వైసీపీ కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అనుమానితుడిగా చేర్చింది సీబీఐ. సీబీఐ అభియోగపత్రంలో ఎంపీ అవినాష్‌ రెడ్డి పేరు కూడా ఉంది. దస్తగిరి వాంగ్మూలంపై సీబీఐ ఫస్ట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో.. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని కథ అల్లిందే ఎంపీ అవినాష్‌ రెడ్డి అని నిర్ధారించింది సీబీఐ.

వివేకా హత్య ప్రమేయంలో ఎంపీ అవినాష్‌ కూడా అనుమానితుడేనని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. వివేకా గుండెపోటుతోనే మరణించాడని చెప్పాలని, సీఐ శంకరయ్యని.. శంకర్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి బెదిరించారని సీబీఐ తెలిపింది. ఇక వివేకా రక్తపు మరకలు తుడిచింది శంకర్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి, ఆయన అనుచరులేనన్న సీబీఐ.. రాజకీయ ఆధిపత్యం కోసమే ఈ హత్య జరిగిందని తేల్చింది.

జగన్‌ సొంత మీడియాలో గుండెపోటు వార్తల సృష్టికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి కలిసి సమాచారం ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో రాసింది. దస్తగిరి వాంగూల్మం ఆధారంగా సీబీఐ ఫస్ట్ ఛార్జ్‌షీట్‌ తయారుచేసింది. వైఎస్‌ వివేకాను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డే హత్య చేయించారన్న అనుమానం ఉందని స్పష్టంగా చెప్పింది సీబీఐ. అవినాష్‌రెడ్డి అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా ఈ హత్య చేయించారన్న అనుమానం వ్యక్తం చేసింది.

దర్యాప్తు కూడా ఈ కోణంలోనే కొనసాగిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిల ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. వివేకా హత్య కేసుకు, 2019 ఎన్నికల నాటి కడప ఎంపీ టికెట్‌కు కూడా లింక్‌ ఉందన్న అనుమానాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది.

కడప ఎంపీ టికెట్టు అవినాష్‌రెడ్డికి ఇవ్వొద్దని, తనకే కావాలని వివేకా కోరారని, అలా కుదరకపోతే షర్మిల లేదా విజయమ్మకు ఇచ్చినా ఫర్వాలేదని చెప్పినట్టు సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ టికెట్‌ తనకు దక్కదన్న అక్కసుతోనే.. అవినాష్‌రెడ్డి వైఎస్‌ వివేకాను హత్య చేయించి ఉంటారనే అనుమానం ఉందని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వివరించింది. వైఎస్‌ వివేకా హత్య వెనుక భారీ కుట్ర ఉందని, దాన్ని వెలికితీసేలా దర్యాప్తు ఉంటుందని కూడా స్పష్టం చేసింది.

వివేకా గుండెపోటుతో మరణించారని ముందుగా ప్రచారం చేసింది కూడా ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డే అని సీబీఐ తేల్చి చెప్పింది. వివేకా గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టం చేసింది. బాత్‌రూమ్‌లో, రక్తపు మడుగులో ఉన్న వివేకానంద రెడ్డి మృతదేహాన్ని.. శంకర్‌ రెడ్డితో కలిసి ఎంపీ అవినాష్‌ రెడ్డి వచ్చి చూశారని, గుండెపోటుతో మరణించారనే థియరీ అప్పటికప్పుడే మొదలుపెట్టారని సీబీఐ తెలిపింది.

అదే సమయంలో అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా వచ్చారని, గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయడంపై అందరూ చర్చించుకున్నారని సీబీఐ స్పష్టంగా వెల్లడించింది. గంగిరెడ్డి, శంకర్‌ రెడ్డి మరికొందరితో కలిసి పనివాళ్లతో బెడ్‌రూమ్‌లో, బాత్‌రూమ్‌లో రక్తపు మరకలను శుభ్రం చేయించారని, వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా కట్లు కట్టించి.. అంబులెన్స్‌లో పులివెందుల ఆస్పత్రికి తరలించారని సీబీఐ సవివరంగా తెలిపింది.

ఫైనల్‌గా ఈ హత్య కేసులో అవినాష్‌ రెడ్డిని అనుమానితుడిగా చేర్చింది సీబీఐ. వివేకా ఇంటికి చేరుకున్న శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి.. హత్యకు సంబంధించిన ఆధారాలు తొలగించాలని చూశారే తప్ప.. వివేకా కుమార్తెకు సమాచారం ఇవ్వలేదని, ఆమె లేకుండానే వివేకా మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారని సీబీఐ తెలిసింది.

తప్పుడు సమాచారం, అసంపూర్తి సమాచారంతో ఎంవీ కృష్ణారెడ్డి ద్వారా ఫిర్యాదు చేయించి దానినే ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయాలని సీఐ శంకరయ్యను శివశంకర్‌రెడ్డి బలవంతం చేశారని కూడా వివరించింది. అలాగే.. వివేకా రక్తపు వాంతులు, గుండెపోటుతో మరణించినట్లు మెసేజ్‌ చేయాలని సీఐ శంకరయ్యని బెదిరించిన విషయాన్ని కూడా సీబీఐ తెలిపింది. వివేకా మద్దతుదారులను కంట్రోల్‌ చేయాలని కూడా సీఐ శంకరయ్యకు శివశంకర్‌రెడ్డి చెప్పినట్టు ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా రాసింది సీబీఐ.

శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి రక్తపు మరకపు తుడిచేయడంలో కీలకంగా వ్యవహరించారని సీబీఐ తెలిపింది. వివేకా ఇంటి పనిమనిషి లక్ష్మి ద్వారా రక్తపు మరకలు తొలగించారని, దూది, బ్యాండేజీ, బాడీ ఫ్రీజర్‌ ఏర్పాటు చేయడంలోనూ వీరిద్దరే ప్రముఖ పాత్ర పోషించారని సీబీఐ స్పష్టంగా వివరించింది. కాంపౌండర్‌ గజ్జల జయప్రకాశ్‌రెడ్డి సహకారంతో శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి రూమ్‌కు గడిపెట్టుకొని కట్టు కట్టడమే కాకుండా.. బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు శుభ్రం చేసి సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో పాలుపంచుకున్నారని సీబీఐ విచారణలో తేలిన విషయాన్ని ఛార్జ్‌షీట్‌లో రాశారు. శి

వశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి బలవంతం చేయడంతోనే పనిమనిషి రక్తం శుభ్రం చేసినట్లు సాక్షి వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కూడా చెప్పారు. 2019 ఫిబ్రవరి 10నే వివేకాను హత్య చేసేందుకు స్కెచ్‌ వేశారని ఈ కేసులో ఏ-4గా ఉన్న షేక్‌ దస్తగిరి సీబీఐ అధికారులకు వివరించినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి, మరికొందరు కలసి వివేకాను హత్య చేయడానికి 40 కోట్లకు ఒప్పందం కుదిరిందని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి చెప్పాడని సీబీఐ వివరించింది.

హత్యానేరాన్ని మీద వేసుకుని లొంగిపోతే 10 కోట్లు ఇస్తామంటూ కె.గంగాధరరెడ్డి అనే వ్యక్తికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చినట్టు కూడా సీబీఐ నిర్ధారించింది. అటు వ్యక్తిగత కక్షలు ఉన్న కారణంగా వివేకా హత్యలో గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి భాగస్వాములు అయ్యారని సీబీఐ తెలిసింది. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి ఎర్ర గంగిరెడ్డి కారణం అంటూ వివేకా తిట్టేవారని, పైగా బెంగళూరులో ఓ భూ వివాదాన్ని సెటిల్‌ చేసినందుకు వివేకా 8 కోట్లు ఆశించారని, దానిలో వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగినా వివేకా ఇవ్వలేదని సీబీఐ తెలిపింది.

డ్రైవర్‌గా తీసేసినందుకు దస్తగిరి, వివేకా ఆస్తులకు బినామీగా ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో అవకాశమివ్వకపోవడంతో గజ్జల ఉమాశంకర్‌రెడ్డి కక్షపెంచుకున్నారు. వివేకా హత్యకు కుట్ర, హత్య తర్వాత ఆధారాలు చెరిపేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి కూడా వైఎస్ వివేకాపై కోపం ఉండేదని సీబీఐ తెలిపింది.

2017లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా టికెట్‌ దక్కకపోవడంతో శివశంకర్‌రెడ్డి వివేకాపై ఆగ్రహం పెంచుకున్నారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. వివేకా ఉంటే రాయలసీమలో తమ ప్రాబల్యానికి ఇబ్బందవుతుందని భావించారని, వీటి కారణంగానే వివేకాను హత్య చేయాలనే కుట్రలో భాగస్వాములయ్యారని సీబీఐ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story