సలాం ఆత్మహత్య.. వైసీపీ ప్రభుత్వ హత్యే : కాల్వ శ్రీనివాసులు
జగన్ సీఎం అవడానికి కారణమైన దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన సలాం కుటుంబ సభ్యులకు విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే రాజప్ప ఆధ్వర్యంలో అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ సీఎం అయిన నాటి నుంచి రాక్షస పాలన సాగుతోందని తెలుగుదేశం నేత జ్యోతుల నవీన్ విమర్శలు గుప్పించారు.
ఏపీలో పోలీసుల దమనకాండ ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుుడ ఫరూక్ విమర్శించారు. ఈ మేరకు సలాం కుటుంబం ఆత్మహత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. సోమప్ప కూడలి నుంచి వినాయక విగ్రహం వరకు ర్యాలీ చేశారు.
సలాం ఆత్మహత్య... వైసీపీ ప్రభుత్వ హత్యేనని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయదుర్గంలోని ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి బళ్లారి రోడ్డు మీదుగా వినాయక సర్కిల్ వరకు ముస్లింలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com