viveka case: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి.. 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా పోలీసు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు పులివెందుల డిఎస్పీ మురళి నాయక్.. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇంటికి ఆయనను విచారించారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్ సునీత సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీని కూడా ఆమె కలిశారు. తాజాగా ఇందులోని పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కృష్ణారెడ్డి ఫిర్యాదులో ఏముందంటే..
ఆనాడు కృష్ణారెడ్డి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు? వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని పులివెందుల న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అప్పటి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారన్నది ఆయన మాట. ముఖ్యంగా సీబీఐ అధికారులు ఏం చెబితే అదే చెయ్యాలని తనను బెదిరించారని అందులో ప్రస్తావించారాయన.
మళ్లీ రంగంలోకి సీబీఐ
రేపో మాపో సీబీఐ రంగంలోకి దిగుతున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నమోదైన కేసులపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఇందులో భాగంగా ఉదయం వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆయన నుంచి కీలక సమాచారం తీసుకున్నారు.
వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. శివశంకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. ఎలాంటి మీడియా సమావేశాలు పెట్టకూడదని ఆదేశించింది. శివశంకర్ రెడ్డి దేశం విడిచి వెళ్లకూడదని పేర్కొంది. కాగా, ఈ కేసులో వివేకానంద పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com