Andhra Pradesh: ఏపీలో కిడ్నీ వ్యాధుల కలకలం.. మరొకరు మృతి..

Andhra Pradesh: ఏపీలో కిడ్నీ వ్యాధుల కలకలం.. మరొకరు మృతి..
Andhra Pradesh: ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ.కొండూరు మండలం మరో ఉద్దానంలో మారుతోందా?

Andhra Pradesh: ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ.కొండూరు మండలం మరో ఉద్దానంలో మారుతోందా? ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే .. కిడ్నీ వ్యాధి బాధితుల ప్రాణాలు పోతున్నాయా? అంటే అవునంటున్నారు సీపీఎం నేతలు. ఏ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండా గ్రామంలో.. ఇవాళ కిడ్నీ వ్యాధితో జరపాల రాంబాబు మృతి చెందాడు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాంబాబు బలియ్యాడంటూ ఆందోళనకు దిగారు బంధువులు, గిరిజనలు, సీపీఎం నేతలు.

గిరిజనుడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆందోళన చేస్తున్నారు. సీపీఎం నేతల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తం మారింది. ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు, ఆనందరావు, సర్పంచ్‌ రంగారావుతో పాటు స్థానికులు పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల్ని మోహరించారు. కిడ్నీవ్యాధితో చనిపోతే.. కనీసం పరామర్శకు కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బంధువులు.

మరోవైపు కాసేపట్లో జగదల్పూర్‌ హైవేపై స్థానికుల ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాంబాబు ఐదేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఫిబ్రవరి నుంచి 72 సార్లు డయాలసిస్‌ జరిగినా ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వలేదంటున్నారు బంధువులు. డయాలసిస్‌ పరికరానికి రూ. 30 వేలు కావాల్సి ఉండగా.. డబ్బుల్లేకపోవడంతో 10 రోజులుగా డయాలసిస్‌ నిలిచిపోయినట్లు చెబుతున్నారు. రాంబాబు పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డయాలసిస్‌ చేయించుకునే స్థోమత లేకపోవడం వల్లే రాంబాబు మృతి చెందినట్లు చెబుతున్నారు. రాంబాబు మృతదేహం వద్ద ఆందోళన దిగిన.. సీపీఎం కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు.. జగన్‌ సర్కారుపై మండిపడ్డారు. ప్రభుత్వం నిరంకుశత్వం వల్లే ఏ. కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారంటూ విమర్శించారు. మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారంతో పాటు 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story