Kondapalli: కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఎన్నికను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నం..
Kondapalli (tv5news.in)
Kondapalli: టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఏపీ కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది అధికార వైసీపీ. నిన్న సభలో నానా యాగిచేసి ఎన్నికను వాయిదా పడేసిన వైసీపీ.. ఇవాళ పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఎన్నిక జరక్కుండా అరాచకాలకు పాల్పడుతోంది. కొండపల్లి ఛైర్మన్ పీఠం టీడీపీ వశం కాబోతోందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతంది.
ఇవాళ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న కూడా వైసీపీ అభ్యర్థుల గొడవతోనే ఛైర్మన్ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. ఛైర్మన్ పీఠాన్ని దొడ్డి దారిన కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి టీడీపీకి 16, వైసీపీ 15 సీట్లు బలం ఉంది.
ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా.. దౌర్జన్యాలకు దిగుతోంది. వైసీపీ అభ్యర్థులు గొడవ చేయడంతో సజావుగా జరగాల్సిన కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. నిన్న కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికపై సభ ప్రారంభం కాగానే వైసీపీ అభ్యర్థులు గొడవకు దిగారు.
వైసీపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్లు బల్లలు విరగొట్టి, కాగితాలు చింపేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎన్నికల అధికారి పోడియంను, ఆఫీసును వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. ఇంత రభస జరుగతుంటే.. ఎమ్మెల్యే వసంత అక్కడే కూర్చుని నవ్వుతూ చోద్యం చూశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో డిప్యూటీ కలెక్టర్.. ఛైర్మన్ ఎన్నికలను ఇవాళ్టికి వాయిదా వేశారు.
ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయడంపై ఎంపీ కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు కౌన్సిల్ హాలులోనే బైఠాయించి నిరసన తెలిపారు. కోరం ఉన్నా ఎన్నికలు జరపకుండా వైసీపీ ఒత్తిడికి తలొగ్గి అధికారులు కావాలనే వాయిదా వేశారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. వాయిదా వేస్తే లిఖితపూర్వకంగా ఇవ్వమని ఆర్‌ఓను కోరినా పట్టించుకోవడం లేదని ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు.
కోరం ఉనప్పటికీ ఎన్నికను ఇంచార్జ్ కమిషనర్ వాయిదా వేశారని.. వాయిదాకి గల కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యుల ప్రతిపాదనను ఎన్నికల అధికారి నిరాకరించారు. ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలను వివరిస్తూ టీడీపీ సభ్యులు ఎన్నికల అధికారికి లేఖ రాశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com