Lok Sabha seats : లోక్‌సభ సీట్లలోనూ కూటమి విజయదుందుభి

తెదేపాకు 16 , పోటీచేసిన రెండు స్థానాల్లోనూ జనసేన గెలుపు, భాజపా ఆరింటిలో విజయం

రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ సీట్లలోనూ కూటమి సత్తా చాటింది. 21 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. దీనిలో తెలుగుదేశం 16 సీట్లలో విజయం సాధించగా జనసేన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది. భాజపా ఆరింటిలో మూడు స్థానాల్లో జయభేరి మోగించగా వైకాపా నాలుగు ఎంపీ సీట్లకే పరిమితమైంది.

రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అప్రతిహత విజయం సాధించింది. 21 స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. పొత్తులో భాగంగా తెదేపా 17చోట్ల పోటీ చేసింది. ఒక్క కడప మినహా..... మిగిలిన అన్నిచోట్లా జెండా ఎగురవేసింది. కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో పోటీ చేసిన జనసేన...... రెండింటిలోనూ విజయబావుటా ఎగురవేసింది. మరోవైపు పొత్తులో భాగంగా భాజపా ఆరు స్థానాల్లో పోటీచేసి.. అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాలను గెలుచుకుంది. అరకులోయ, తిరుపతి, రాజంపేట స్థానాలను కోల్పోయింది. వైకాపా నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. దీంతో 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైకాపా.... లోక్ సభ సీట్ల విషయంలో కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్లయింది. శాసనసభ అభ్యర్థులతో పోలిస్తే లోక్ సభ అభ్యర్ధులకు క్రాస్ ఓటింగ్ జరగడంతో నాలుగు స్థానాలను వైకాపా సాధించుకోగలిగింది. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైకాపా.. ప్రస్తుతం నాలుగింటికే పరిమితం కావాల్సి వచ్చింది. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి గెలుపొందారు. ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్‌... అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్‌ నాయుడు వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విజయనగరం నుంచి తెదేపా అభ్యర్థి అప్పలనాయుడు ఘన విజయం సాధించారు. విశాఖపట్నం నుంచి మతుకుమిల్లి శ్రీభరత్‌ 5 లక్షలకు పైగా మెజార్టీతో సత్తా చాటారు.

లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్‌ మాథుర్‌ అమలాపురం నుంచే గెలిచారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గెలుపుబాటలో ఉన్నారు. నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. ఈ ముగ్గురూ 2019లో వైకాపా నుంచి గెలిచి, ఇప్పుడు తెదేపాలో చేరి అక్కడా గెలిచారు. రాజంపేట నుంచి వైకాపా అభ్యర్థి మిథున్‌రెడ్డి మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఓడించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి నెల్లూరు నుంచి పోటీచేసిన విజయసాయిరెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలిచారు.


Tags

Next Story