4 April 2021 9:30 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / సర్పంచ్‌‌‌‌‌గా పోటీ...

సర్పంచ్‌‌‌‌‌గా పోటీ చేయించి మోసం: ఏపీ సీఎం జగన్‌‌కు మహిళ లేఖ..!

పంచాయతీ ఎన్నికల్లో పోటి చేయించి వైసీపీ నాయకులు తమను మోసం చేశారని సర్పంచి అభ్యర్థి గీత, భర్త హంపయ్య వాపోతున్నారు.

సర్పంచ్‌‌‌‌‌గా పోటీ చేయించి మోసం: ఏపీ సీఎం జగన్‌‌కు మహిళ లేఖ..!
X

కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటి చేయించి వైసీపీ నాయకులు తమను మోసం చేశారని సర్పంచి అభ్యర్థి గీత, భర్త హంపయ్య వాపోతున్నారు. తమను ఆదుకోవాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని సీఎం జగన్ కు లేఖ రాశారు.

దేవనకొండ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో హంపయ్య భార్యను పోటీ చేయించాలని పార్టీ కన్వీనర్ రామకృష్ణ, స్థానిక నేత వడ్డే ఉరుకుందు భావించారు. అయితే తమకు ఎన్నికల్లో ఖర్చు చేసే స్తోమత లేదని హంపయ్య తెలపగా.. 15లక్షల రూపాయలు భరించండని.. మిగిలినవి తాము భరిస్తామని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం హంపయ్య దంపతులు 15లక్షలు ఖర్చు చేయగా.. వైసీపీ నేతలు చివర్లో ప్లేట్ ఫిరాయించారని ఆవేదన వ్యక్తంచేశారు.

తమను ఆదుకోవాలని పదే పదే బతిమలాడడంతో మూడు ఎకరాలు తనకు రాసిస్తే డబ్బులు ఇస్తానని షరతు పెట్టి బాండు రాయించుకున్నారు. సర్పంచిగా గెలిస్తే రెండేళ్లలో మీ భూమిని మీకు ఇస్తాను.. ఓడిపోతే రెండు నెలల్లోనే ఇచ్చేస్తాను అని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. గత్యంతరం లేక హంపయ్య దంపతులు బాండుపై సంతకాలు చేశారు. అప్పటికే 15లక్షలు ఖర్చు చేసిన వారు.. మరో 10లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టారు.

కానీ కొంత మంది వార్డు సభ్యులు మోసం చేయడంతో సర్పంచిగా గీత ఓడిపోయారు. ఒప్పందం ప్రకారం రెండు నెలల్లోనే భూమిని ఇవ్వాల్సి ఉండగా.. అందుకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక వైసీపీ నేతలకు రాసిచ్చిన బాండు, ఇతర ఆధారాలతో సహా సీఎం జగన్ రెడ్డికి లేఖ రాశారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని వేడుకుంటున్నారు.

Next Story