AP Government : ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్
AP Government : అభివృద్ధి లేదు.. సంక్షేమం పేరు చెప్పి అప్పుల మీద అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు.. సొసైటీలు, కార్పొరేషన్ల పేర్లతో వేల కోట్ల అప్పులు చేస్తున్న ఏపీ సర్కార్.. ఆ డబ్బంతా సంక్షేమ పథకాల పేరుతో పంచి పెడుతోంది.. అయితే, బడ్జెట్‌లో నమోదు కాని రుణాలుగా ఇవి ఇప్పటి వరకు కొనసాగుతుండగా.. వీటన్నిటికీ లెక్కలు చెప్పాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో సర్కారులో వణుకు మొదలైందనే చర్చ జరుగుతోంది.. అప్పులపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి లేఖ రావడంతో ఏం చేయాలో అర్థం కాక అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.
అప్పులపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాసింది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం.. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్ అప్పులపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం ఈనెల చివరి నాటికి వివరాలు సమర్పించాలని కోరింది. ప్రభుత్వ హామీతో పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని కోరుతూ లేఖ రాసింది.
ప్రభుత్వ హామీతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బహిరంగ మార్కెట్ నుంచి కార్పొరేషన్లు, సొసైటీ రుణాలు తీసుకున్నాయని.. ఆయా సంస్థల పేరు, ఏ ఆర్థిక సంస్థ నుంచి రుణం ఎంత మేర తీసుకున్నారో తెలపాలని పీఏజీ కార్యాలయం కోరింది. ప్రభుత్వ పథకాల అమలు కోసం బడ్జెట్‌లో నమోదు కాని ఈ రుణాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే మారుతున్నాయని పీఏజీ కార్యాలయం స్పష్టం చేసింది.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఖాతాలకు సంబంధించి ఆడిట్ నిర్వహించాల్సి ఉన్నందున మే 31లోగా వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది.
జగన్ సర్కార్ అప్పులు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.. కొత్త కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేసి మరీ వాటి పేరు మీద వేల కోట్ల అప్పులు తెస్తోంది.. అప్పుల పరిమితి మించిపోవడంతో కొత్త రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతోంది.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతి వారం కొత్త అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.. ఆదాయానికి, వ్యయానికి అంతరం పెరుగుతున్న కొద్దీ దానిని పూడ్చడం కోసం చేస్తున్న అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి.. అయితే, ప్రభుత్వం కొత్తగా చేస్తున్న అప్పుల్లో చాలా భాగం పాత అప్పులు, వడ్డీలు తీర్చడానికి ఖర్చవుతోంది.. అయితే, ప్రభుత్వం ఖర్చు పెట్టేందుకు కార్పొరేషన్ పేరిట అప్పులు ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com