LOKESH: నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరా

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ వెనుక తాము లేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. ఈ విషయంలో బీజేపీపై జగన్ నిందలు వేస్తున్నారని అమిత్ షా చెప్పారని మీడియాతో చిట్‌చాట్‌లో లోకేశ్ వివరించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తాము సవాల్ చేసిన 17A అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకుంటే చాలామంది ఇబ్బంది పడతారని పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో ముచ్చటించిన లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీలో చర్చకు వచ్చిన వివరాలు చెప్పారు. తనను అమిత్ షా కలవాలని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేయడం వల్ల వెళ్లి కలిసినట్లు తెలిపారు. సీఐడీ తనను ఎందుకు పిలిచింది, ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారని ఆ వివరాలు తెలియజేసినట్లు వివరించారు. స్కిల్ కేసులో 3 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 27 కోట్లు అంటోందని ఎద్దేవాచేశారు. అది కూడా పార్టీ ఖాతాకు వెళ్లాయని చెబుతున్నారని తెలిపారు. ఇవి పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కేసులేనని అమిత్ షాకు చెప్పినట్లు లోకేశ్ వెల్లడించారు. వైసీపీ ఎంపీ, మంత్రి నేరుగానే బీజేపీ ఈ పనులు చేయిస్తోందని అన్నట్లు అమిత్ షాకు చెప్పానన్నారు.
బీజేపీ పేరు చెప్పి తెలుగుదేశం పార్టీపై కక్షసాధింపు చర్యలు చేపట్టినట్లు ఉందని అమిత్ షా అన్నట్లు వివరించారు. నిజం వైపు ఉండాలని అమిత్‌షాను కోరానని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నట్లు చెప్పానన్న లోకేశ్ భద్రతాపరంగా ఉన్న ఆందోళన కూడా చెప్పానని పేర్కొన్నారు. రాజమండ్రి జైలులోనే మాజీ నక్సలైట్లు కూడా ఉన్నారని తెలిపారు. 10 రోజులుగా స్కిల్ కేసుపై వైసీపీ మాట్లాడటం మానేసిందన్న లోకేశ్ అక్రమ కేసుపై వైసీపీ శ్రేణుల్లోనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో గత 34 రోజుల్లో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని తెలిపారు. చంద్రబాబుపై 4 కేసులు నమోదుచేశారన్న ఆయన అందులో 3 అవినీతి కేసులు, ఒక హత్యాయత్నం కేసు ఉన్నట్లు గుర్తుచేశారు. మూడూ తప్పుడు కేసులు కాబట్టే 17A పై న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. హత్యాయత్నం కేసుపైనాన్యాయ పోరాటం చేస్తామన్నారు. స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో తాము సవాల్ చేసిన 17 ఏ అంశం చాలా కీలకమైందన్న లోకేశ్, దానిని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల రాజకీయంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. తన తల్లి ఐటీ రిటర్న్‌లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించిన లోకే ఈ వ్యవహారంపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com