LOKESH: అవినీతిపై జగన్ మాట్లాడటమా..?

అవినీతి గురించి వైసీపీ అధినేత జగన్ మాట్లాడటం వింతగా ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం ఇలాటింవన్నీ జగన్ పాలనలో జరిగాయని గుర్తు చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటిందని లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోందన్నారు. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలని అర్థం చేసుకోకపోతే ఎలా అని నిలదీశారు. నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లిందని లోకేశ్ అన్నారు. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని.. ఏ ఘటననూ ఉపేక్షించబోమన్నారు. ఏ నిందితుడినీ వదిలేది లేదన్న లోకేశ్.... బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరన్నారు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం ఇది కాదన్న లోకేశ్... ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిదని అన్నారు.
మరోవైపు కష్టాల్లో ఉన్న వారికి నేనున్నాంటూ లోకేశ్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 18వ రోజు గురువారం ప్రజాదర్బార్‌లో విన్నపాలు స్వీకరించిన లోకేశ్ ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నందిగం సురేష్ టిప్పర్ లారీ నా మనవడిని బలితీసుకుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని నాలుగేళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన తాళ్ళ నాగరాజు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను విన్న లోకేశ్ పరిశీలించి తగిన న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com