Andhra Pradesh : అల్పపీడనం ప్రభావం..కోస్తాంధ్రలో భారీవర్షసూచన

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com