Andhra Pradesh : బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో రెండు రోజులు ఏపీలో వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, మరియు పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇప్పటికే శ్రీకాకుళంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, అరకు ఏజెన్సీలో భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన చాపరాయి సందర్శనను నిలిపివేశారు.
ఉత్తరాంధ్రతో పాటు, దక్షిణ కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, మరియు గుంటూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 7 గేట్ల ద్వారా 1,87,852 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,24,618 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 2,80,230 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.30 అడుగుల వద్ద ఉంది. వర్షాలు తగ్గుముఖం పడితే ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com