AP: ఫైళ్ల దహనం కేసులో వైసీపీ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

AP: ఫైళ్ల దహనం కేసులో వైసీపీ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై ఉచ్చు... కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనలో పాత్ర ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై ఉచ్చు బిగుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితులను ఒక్కొక్కరిని విచారిస్తున్నకొద్దీ, అక్రమాల డొంక కదులుతోంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొందరి కోసం గాలిస్తున్నారు. కుట్ర కోణాన్ని ఛేదించేందుకు వందలమంది అనుమానితుల ఫోన్‌కాల్స్‌ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ నెల 21న.. ఆదివారం అర్ధరాత్రి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టగా, ఈ వారం రోజుల్లో పలువురు అధికారులు, అనుమానితులను విచారించి, కీలక సమాచారం రాబట్టారు. ఈ నేరానికి పాల్పడింది పక్కాగా పెద్దిరెడ్డి అనుచరులేనని అంచనాకు వచ్చారు. దస్త్రాలను రెవెన్యూ సిబ్బందితో దహనం చేయించారా? లేక వైకాపా మూకలే ప్రత్యక్షంగా పాల్గొన్నాయా? అన్నది తేల్చడానికి ఫోరెన్సిక్‌ నివేదిక కోసం వేచి చూస్తున్నారు.


ఫైళ్ల దహనం కేసులో అనుమానితుడు, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి వారం రోజులుగా పరారీలోనే ఉన్నారు. అతని ఆచూకీని గుర్తించడానికి వీల్లేకుండా సెల్‌ఫోన్‌ ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఘటనకు వారం రోజుల ముందు నుంచి మాధవరెడ్డి తరచూ సబ్‌ కలెక్టరేట్‌కు వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మదనపల్లె పురపాలక సంస్థ వైస్‌ ఛైర్మన్‌ జింకా చలపతిని శనివారం అతని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ లావాదేవీలకు సంబంధించి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. బండపల్లి సర్పంచి ఈశ్వరమ్మ భర్త అక్కులప్పను కూడా మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి, విచారించి, వదిలేశారు

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్‌జాన్‌ పాత్రపై అనుమానంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే అతని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. అప్పటికే అతను పరారైనట్లు గుర్తించారు. అతని ఇంట్లోని దస్త్రాలను సీజ్‌ చేసేందుకు పోలీసులు వెళ్లగా, కుటుంబ సభ్యులు తాళం వేసి, తాళపు చెవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఎర్రచందనం స్మగ్లర్‌గా పేరున్న బాబ్‌జాన్‌.. మదనపల్లె డివిజన్‌లో పెద్దిరెడ్డి పేరు చెప్పి అనేక భూదందాలు సాగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో మదనపల్లె పూర్వ ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్, కాపలాగా ఉన్న వీఆర్‌ఏ రమణయ్యను వారం రోజులుగా పోలీసులు విచారిస్తూనే ఉన్నారు.

Tags

Next Story