Minister Lokesh : దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్

దేశంలో అత్యుత్తమ మోడల్‌లో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ నిర్మాణం చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ ఏర్పాటుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచస్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో టాప్ 20 ఆభరణాల తయారీసంస్థలు మంగళగిరి పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ఉడిపిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యుయలరీ పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు లోకేశ్ సూచించారు. దీనిపై స్కిల్ డెవలప్ మెంట్ సీఈవో గణేష్ కుమార్ స్పందిస్తూ.. త్వరలో ఏర్పాటుచేసే కామన్ ఫెసిలిటీ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతిఏటా 4వేలమందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పార్కులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ & రిటైల్ జోన్, మ్యానుఫాక్చరింగ్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇన్ ఫ్రా జోన్ అంతర్భాగాలు ఉంటాయని తెలిపారు.
మంగళగిరిలో యువతకు నైపుణ్యశిక్షణ అందించే మోడల్ కెరీర్ సెంటర్‌ను కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని లోకేశ్ సూచించారు. ఎంసీసీ ద్వారా కెరీర్ కోచింగ్, జాబ్ మ్యాచింగ్, స్కిల్ అప్ గ్రేడేషన్, ఎంప్లాయర్ ఎంగేజ్ మెంట్ చేపట్టాలన్నారు. మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన 3 జాబ్ ఫెయిర్లకు 1170మంది యువకులు హాజరుకాగా, 453మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ... ఇకపై ప్రతినెలా జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు నూరుశాతం ఉద్యాగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com