CHIRU: భారీ వర్షాల వేళ చిరంజీవి కీలక విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. ‘మీ కుటుంబసభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా అండగా ఉంటారని ఆశిస్తున్నాను.’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. దయచేసి అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని సూచించారు. పిల్లలు, వృద్ధులను ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. తాత్కాలిక నిర్మాణాలు, శిథిలమైన భవనాలకు దూరంగా ఉండాలని కోరారు. వరద బాధితలకు సహాయం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్దంగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏపీకి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
ఖమ్మం జిల్లాతో పాటు ఏపీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరింది. దీంతో జిల్లా నుండి ఏపీలోని విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. ఇక మధిర చుట్టూ వరద నీరు ముంచెత్తడంతో మధిర నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు. మధిర పట్టణానికి సర్వీసులన్నీ నిలిపివేయగా, మధిర నుండి కల్లూరు మార్గంలోనూ సర్వీసులు నిలిపేశారు.
డేంజర్‌లో హుస్సేన్‌సాగర్
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తింది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి నాలాల నుంచి వరద హుస్సేన్‌సాగర్‌లోకి వస్తుంది. జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com