AP: టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. తణుకులో రూ.36 కోట్ల విలువైన బాండ్లను జారీ చేయాల్సి ఉండగా రూ.700 కోట్లకు పైగా జారీ చేసినట్టు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. నెల్లూరు, కడప లే అవుట్లలో అవకతవకలపై విచారణా కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తమ హయాంలో మంజూరు చేసిన దాదాపు 9 లక్షల టిడ్కో గృహాల నిర్మాణాలను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందన్నారు. ఈ పథకాలన్నింటినీ పునఃప్రారంభించేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
మోదీతో చంద్రబాబు భేటీ
గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ను పెద్ద మనసు చేసుకుని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... ప్రధాని మోదీని కోరారు. సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఏడు ప్రాధాన్యాంశాలను ప్రధాని ముందు ఉంచిన చంద్రబాబు... సంపూర్ణ సహకారం అందించాలని విన్నవించారు. ఏపీకి ఆర్థికంగా చేయూత.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం, అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాలకు సమగ్ర ఆర్థిక మద్దతు.. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు.. రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు.. బుందేల్‌ఖండ్ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, దుగరాజపట్నం రేవు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు.
అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను చంద్రబాబు కోరారు. ఏపీకి సంబంధించి పలువురు జాతీయ రహాదారుల నిర్మాణానికి సంబంధించి సీఎంతో విస్తృతంగా చర్చించానని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీ తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు సంసిద్ధంగా ఉందని.. రాష్ట్రాన్ని సుసంపన్నమైన, అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలమనే విశ్వాసం తనకుందని చంద్రబాబు తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో జరిపిన భేటీలో సహకార సమాఖ్య స్ఫూర్తితో చర్చలు జరిగాయన్నారు. కేంద్ర వ్యవసాయ శివరాజ్ సింగ్ చౌహాన్, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్ పురీతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఉదయం పీయూష్ గోయల్‌తో అల్పాహార విందు సమావేశంతో తన షెడ్యూల్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. రాత్రికి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ అధికారులకు విందు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com