ఉద్యోగులకు మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక.. ఎన్నికల తీరుపై ఎస్ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు
ఏపీలో పంచాయతీ ఎన్నికల తీరుపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. నామినేషన్ల ప్రక్రియలో దాడులకు దిగిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎస్ఈసీని అడిగామన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. దువ్వాడపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి.. అచ్చెన్నను మాత్రం అరెస్ట్ చేశారన్నారు.
రాష్ట్రంలో వైసీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. శ్రీకాకుళంలో పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఈసీని అడిగామన్నారు. అచ్చెన్నాయుడు కేసు విషయమై దర్యాప్తు కోసం స్పెషల్ ఆఫీసర్‌ను శ్రీకాకుళం వెళ్లమని ఆదేశించినట్లు ఎస్ఈసీ చెప్పారన్నారు బోండా ఉమ.
మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట విని ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే మార్చి 31 తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. IASలైనా, IPSలైనా తాము చెప్పినట్టే వినాలన్నారు. నిమ్మగడ్డకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకుని.. వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారుల తీరుపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఎర్రావారిపల్లె మండలం ఉదయమాణిక్యం పంచాయతీలో భరత్ కుమార్ అనే వ్యక్తి.. రెండో విడతలో అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశాడు. అతడ్ని ప్రపోజ్ చేసిన దేవరకొండ శ్రీనివాస్ అనే వ్యక్తిది.. ఓటరు లిస్టులో నెంబరు తప్పుగా ప్రచురితమైంది. అయితే వాటిని సరిచేయవచ్చని చెప్పిన ఆర్ఓ శేఖర్ బాబు.. చివరి నిమిషంలో నామినేషన్‌ను రిజెక్ట్ చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
ఇక రామచంద్రాపురం మండలంలో నామినేషన్ విత్ డ్రా చేయకముందే.. విత్ డ్రా అయినట్లు అధికారులు పక్కన పెడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నడవలూరు పంచాయతీకి వైసీపీ మద్ధతుతో గణపతిరెడ్డి.. టీడీపీ మద్ధతుతో కమలాకర్ రెడ్డిలు సర్పంచ్ గా నామినేషన్ వేశారు. అయితే తాను విత్ డ్రా చేసుకోకపోయినా విత్ డ్రా అయినట్లు ఎంపిడిఓ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారని టీడీపీ మద్దతుదారుడు కమలాకర్ రెడ్డి ఆరోపిస్తున్నాడు.
నెల్లూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. నెన్నూరు పంచాయతీలో ఎనిమిదవ వార్డుకు జ్యోతి అనే మహిళ నామినేషన్ వేసింది. అయితే తన సంతకం లేకుండానే నామినేషన్ విత్ డ్రా అయినట్లు ఉందని జ్యోతి ఆరోపిస్తోంది. దీంతో ఆర్సీ పురం ఎంపీడీవో ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు.
ఇక అనంతపురం జిల్లా మర్రిమాకులపల్లి రిటర్నింగ్ అధికారిణి ప్రభ వైసీపీకి వత్తాసు పలుకుతోందని మండల పరిషత్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వార్డు మెంబర్ గా పోటీచేస్తున్న వైసీపీ మద్దతుదారుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని ఫిర్యాదు చేయడానికి వెళితే.. ఆమె తమ ఫిర్యాదును స్వీకరించలేదని నిరసన చేపట్టారు.
గుంటూరు జిల్లా కాకుమానులో ఏకగ్రీవాలపై విజిలెన్స్ అధికారి రామచంద్రరావు విచారణ చేపట్టారు. ఏకగ్రీవ అభ్యర్థులు, నాయకులతో మాట్లాడి గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీశారు. ఈ నివేదికను కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు.
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ఓఎస్డీ సూర్యచంద్రరావు, పార్వతీపురం డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో పోలీసుల బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com