MK Stalin: జగన్ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ సీరియస్‌ లెటర్‌..

MK Stalin: జగన్ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ సీరియస్‌ లెటర్‌..
MK Stalin: కుశస్థలి నదిపై రిజర్వాయర్లు కట్టొద్దంటూ సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా లేఖ రాశారు.

MK Stalin: కుశస్థలి నదిపై రిజర్వాయర్లు కట్టొద్దంటూ సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో కుశస్థలి నదిపై కార్వేటినగరం మండలం కత్తెరపల్లి, నగరి మండలం ముక్కలకండ్రిగ సమీపంలో నిర్మించాలని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ ఆ నదిపై జలాశయాలు నిర్మిస్తే చెన్నై, పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందదని తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఏపీ సర్కార్‌ నిర్మించే రిజర్వాయర్ల వల్ల పూండి రిజర్వాయర్‌ ఇన్‌ఫ్లోపై ప్రభావం చూపుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

చెన్నైకు తాగునీటిని అందించేది పూండి రిజర్వాయరే. దీంతో ఆ నదిపై ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని జగన్‌కు లేఖ రాశారు సీఎం స్టాలిన్. కుశస్థలి నది అంతర్రాష్ట్ర నది కావడంతో దిగువ రాష్ట్రమైన తమిళనాడు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి కొత్త ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు. రిజర్వాయర్ల నిర్మాణానికి డిజైన్లు రూపొందించడం, వాటిని ఆమోదించడం, నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో కుశస్థలి నది పరీవాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని, సమస్య సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని తక్షణ వ్యక్తిగత జోక్యాన్ని అభ్యర్థిస్తున్నానంటూ జగన్‌కు స్టాలిన్‌ లేఖ రాశారు.

రెండు ప్రాజెక్టుల పనులను విరమించుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ రాయడంతో జలవనరుల శాఖ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. రెండేళ్లుగా భారీ వర్షాలు పడుతుండటంతో సుమారు 10 టీఎంసీల నీరు వృథాగా తమిళనాడుకు వెళ్లింది. దీంతో కార్వేటినగరం, నగరిలో ప్రాజెక్టులు నిర్మిస్తే ఇక్కడి రైతులకు ఉపయోగంగా ఉంటుందని అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు.

ముక్కలకండ్రిగలో 78 కోట్లు, కత్తెరపల్లిలో 85 కోట్లతో నూతనంగా రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దశాబ్దం కిందటే ఈ రెండింటికీ అంతర్రాష్ట్ర అనుమతులు వచ్చినట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఇంతలో తమిళనాడు సీఎం లేఖతో.. ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటని జలవనరుల శాఖలో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story