Tirupati MLC : ఎమ్మెల్సీ కిడ్నాప్ కాలేదు: తిరుపతి ఎస్పీ

తిరుపతి ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ‘ఎమ్మెల్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనే వీడియో విడుదల చేశారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌తో పాటు బందోబస్త్ పెంచాం. బాలాజీ కాలనీ నుంచి ఎస్వీయూ వరకు వాహనాలు మళ్లించాం’ అని ఎస్పీ స్పష్టం చేశారు. కిడ్నాప్ వ్యవహారం హాట్‌టాపిక్ కావడంతో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పందించారు. 'నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను.. డాక్టర్ డిశ్చార్ చేయగానే తిరుపతికి వస్తాను, కిడ్నాప్ చేశారని వదంతులు సృష్టించొద్దు' అని ఎమ్మెల్సీ కోరారు.
డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో రెండో రోజు తిరుపతి లో అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద, అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు చేరడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒక క్రమంలో ఒకరిపై ఒకరు దాడిచేశారంటూ పుకార్లు షికారు చేయడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com