BALAYYA: నేనొస్తున్నా.. భయపడొద్దు: బాలకృష్ణ

ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే జగన్ కక్ష సాధింపులకు దిగుతున్నారని నందమూరి బాలకృష్ణ విమర్శించారు. జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారని, చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారన్న ఆయన.. సీఎం కేవలం పాలసీ మేకర్ మాత్రమేనని, అధికారులే అమలు చేస్తారని వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అజేయ కల్లం ప్రతిపాదిస్తే ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారని బాలయ్య తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసిందని, 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
ఇలాంటివి ఎన్నో చూశామని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని బాలకృష్ణ తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తామని, ఉన్న సంస్థలు విధ్వంసం చేసి, యువతను గంజాయికి బానిస చేసిందని మండిపడ్డారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు. భవిష్యత్తులో పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారని హెచ్చరించారు. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోను కానీ అతిక్రమిస్తే ఉపేక్షించనని బాలకృష్ణ తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్న బాలకృష్ణ.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తామన్నారు. నేనొస్తున్నాని ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదామని బాలయ్య పిలుపునిచ్చారు. జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి... బెయిల్‌పై బయట తిరుగుతున్నారని గుర్తు చేశారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారన్న బాలయ్య... ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షసాధింపుతోనే కుట్ర చేశారన్నారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని... జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని.. హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com