TDP: నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

TDP: నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
X
గాంధీ జయంతి రోజున చంద్రబాబు సతీమణి దీక్ష... న్యాయ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టీకరణ...

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత నారా లోకేష్ ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ టీడీపీ శ్రేణులకు ధైర్యం చెప్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఘీభావం తెలపాలని కోరారు.


చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేస్తారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు. ఇంటి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో తెలుగుదేశం పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల, అశోక్ బాబు ఇతర సీనియర్ నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.

చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక దాదాపు 97 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్న ఆయనచనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతామని తెలిపారు. మరోవైపు జనసేన తెలుగుదేశం జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు అచ్చెన్న వెల్లడించారు. త్వరలోనే తెలుగుదేశం, జనసేన నుంచి కొంతమందితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే తాము కలిసి పనిచేస్తున్నామని అచ్చెన్నా స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు టీడీపీ-జనసేన పొత్తు ఉండటంతో టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని.. ఇకపై ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు.

మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయడంపై తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు మద్దతు తెలిపిన టీడీపీకి జనసేన నేతలు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Next Story