7 గంటలకు పైగా నిరసన తెలుపుతున్న చంద్రబాబు.. అధినేత ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన

7 గంటలకు పైగా  నిరసన తెలుపుతున్న చంద్రబాబు.. అధినేత ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
చంద్రబాబు నిర్బంధాన్ని నిరసిస్తూ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్న టీడీపీ కార్యకర్తలు వచ్చినవారిని వచ్చినట్టే అరెస్టు చేస్తుండడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహజ్వాల వ్యక్తమవుతోంది.

పావుగంటా కాదు.. అరగంటా కాదు.. గంటా కాదు.. ఏకంగా 7 గంటలు. ఔను.. 7 గంటలుగా ప్రతిపక్ష నేత నిర్బంధం. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉదయం 9.40 నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబును బయటకు రానివ్వడం లేదు. కోవిడ్ నిబంధనలని, ఎన్నికల కోడ్‌ అని చెప్తూ.. ఆయన్ను లాంజ్‌లోనే ఆపేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అవకతవకల్ని, అక్రమాలను నిరసిస్తూ ఇవాళ చిత్తూరు, తిరుపతిలో ధర్నాల్లో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఈ కార్యక్రంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్నారు. ఆ క్షణం నుంచి ఎయిర్‌పోర్ట్ లోపల-బయట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు పంపేది లేదని పోలీసులు తేల్చి చెప్పేయడంతో చంద్రబాబులో కోపం కట్టలు తెంచుకుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనేచేసిన తనను ఇలా ఆపేయడంపై భగ్గుమన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఉన్నచోటే నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. చాలా సేపు ఆయన కిందే కూర్చుండిపోయారు. మధ్యాహ్న భోజనం లేదు. మంచినీళ్లు కూడా ముట్టలేదు.

మధ్యలో జిల్లా కలెక్టర్‌లోను, ఎస్పీతోనూ మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో తమకు ప్రశ్నించే హక్కు లేదా అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం తర్వాత SP వచ్చి చర్చలు జరిపినా ప్రతిష్టంభన వీడలేదు. బయటకు పంపాల్సిందేనని చంద్రబాబు.. ససేమిరా అంటూ SP.. చివరికి చంద్రబాబును మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇస్తారంటూ పోలీసులు చెప్పినా చివరికి ఆ విషయంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.

దాదాపు 7 గంటలుగా నిరసన తెలుపుతున్న చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. చంద్రబాబు నిర్బంధాన్ని నిరసిస్తూ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్న టీడీపీ కార్యకర్తలు వచ్చినవారిని వచ్చినట్టే అరెస్టు చేస్తుండడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహజ్వాల వ్యక్తమవుతోంది. పోలీసులు అధికారపార్టీ చెప్పినట్టే ప్రవర్తిస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

చంద్రబాబును ఎయిర్‌పోర్ట్‌లో ఆపేసిన పోలీసులు ఆయన్ను తిరిగి హైదరాబాద్ పంపేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఓసారి బలవంతంగానైనా ఫ్లైట్‌లో పంపాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు తాను కలెక్టర్, ఎస్పీలను కలవకుండా వెనుతిరిగేది లేదని భీష్మించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. పలుమార్లు చంద్రబాబు వద్దకు వచ్చిన పోలీసులు ఆయన దీక్ష విరమించాలని అభ్యర్థించారు. ఐతే.. ప్రజాస్వామ్యంలో తనకూ హక్కులు ఉంటాయని చంద్రబాబు అన్నారు. నేనేమైనా హత్యలు చేయడానికి వెళ్తున్నానా.. 14 ఏళ్లు సీఎంగా చేశానంటూ ఆవేశంతో మాట్లాడారు.

మీరు పెద్దవాళ్లు కింద కూర్చోవడం బాగోదని పోలీసులు చెప్పినా.. బాబు పర్వాలేదంటూ అక్కడే బైఠాయించారు. చిత్తూరు కలెక్టర్‌తోపాటు చిత్తూరు, తిరుపతి ఎస్పీల వద్దకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. వాళ్లనే ఎయిర్‌పోర్ట్‌కు రప్పిస్తామని పోలీసులు చెప్పినా తనకు అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని తాను వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెడుతూనే నోటీసులు ఆయన చేతిలో పెట్టారు పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని, ఈ పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటు ఎయిర్‌పోర్ట్‌లోనే చంద్రబాబును కట్టడి చేసిన పోలీసులు.. చిత్తూరు జిల్లా TDP నేతలందరినీ రాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక వారిని అదుపులోకి తీసుకున్నారు. అటు, ఈ అరెస్టులు, నిర్బంధాలపై తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా TDP శ్రేణులు ర్యాలు, ధర్నాలకు దిగారు.


Tags

Read MoreRead Less
Next Story