CBN: కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయం

CBN: కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయం
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం... సమర శంఖం పూరించిన చంద్రబాబు

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలోనిర్వహించిన విజయోత్సవ సభ వేదికగా తెలుగుదేశం-జనసేన ఎన్నికల శంఖారావం పూరించాయి. యువగళం ముగింపు సభకు లక్షలాదిగా తెలుగుదేశం-జనసేన కార్యకర్తలు తరలిరాగా.....రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ , ముఖ్యనేతలు వైసీపీ సర్కారుపై సమరభేరి మోగించారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగించిన వైసీపీకి కాలం చెల్లిందని చంద్రబాబు మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమని చెప్పారు. గతంలో ఎన్నో పాదయాత్రలు జరిగినా.... తొలిసారి లోకేశ్ యాత్రపై అనేక రకాలుగా దాడులు చేసి, ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. అయినప్పటికీ యువగళం జనగళంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పరిశ్రమలను తరిమికొట్టారన్న చంద్రబాబు.. యువతకు ఉపాధి అవకాశాలు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.


వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోందని నారా చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ప్రజల ఆస్తులు కబ్జా చేస్తే రక్షించే నాథుడే లేడని విమర్శించారు. యువత సహా అన్నివర్గాలకు తెలుగుదేశం-జనసేన అండగా ఉంటాయన్న ఆయన.... భావితరాల భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. ఇదే సమయంలో జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఆయన రాజకీయాలకు అనర్హుడని వ్యాఖ్యానించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భారత దేశంలో పాదయాత్రలు చేయడం కొత్తకాదని.. తాను కూడా పాదయాత్ర, బస్సు యాత్ర చేశానని.. కానీ, ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని అన్నారు. మొదటి సారిగా సైకో జగన్‌ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశామన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. యువగళం వాలంటీర్లను జైలుకు పంపారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని... యువగళం.. ప్రజాగర్జనకు నాంది పలికిందని... ప్రజల్లో ఉండే బాధ, ఆక్రోశం, ఆగ్రహం యువగళంలో చూపించారని అన్నారు.


వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోందని.. మెడపై కత్తి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని.. ఇప్పుడు గంజాయి రాజధానిగా మారిందన్నారు. జగన్‌రెడ్డికి ఒక్కఛాన్స్‌ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంస పాలనకు జగన్‌ నాంది పలికారని.. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయని... రుషికొండను బోడిగుండు చేసి.. సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిని సర్వనాశనం చేసి మూడుముక్కలాట ఆడారని...టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లమని.... అబద్ధాల పునాదులపై నిర్మించిన పార్టీ వైసీపీ అని... వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story