CBN: మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి

CBN:  మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి
X
ఉపాధి కల్పన మా బాధ్యత... యువగళం విజయోత్సవ సభ వేదికగా చంద్రబాబు వరాలు

త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి.. టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించామని వెల్లడించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని.. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తామని... అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తామన్న చంద్రబాబు... భవిష్యత్‌లో ఏయే కార్యక్రమాలు చేయాలనేదానిపై అధ్యయనం చేస్తామని తెలిపారు. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్న చంద్రబాబు... టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించినప్పుడే వైసీపీ పని అయిపోయిందన్నారు. టీడీపీ-జనసేన పొత్తు చారిత్రక అవసరమన్నారు.


మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీ.. వైసీపీ విముక్త రాష్ట్రంగా మారాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీకాదని... జగన్‌ రాజకీయాలకు అనర్హుడని మండిపడ్డారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా..అది శాపంగా మారుతుందని ప్రజలను హెచ్చరించారు. జగన్‌ చేసిన తప్పులు ఆంధ్రప్రదేశ్‌కు శాపంగా మారాయని... ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని ఆరోపించారు. టీడీపీ, జనసేనకు ఓటు వేస్తారనుకుంటే వారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మీరు ఒక త్యాగం చేస్తే.. మేం వంద త్యాగాలు చేసి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తామన్నారు. అభివృద్ధి చేయడానికి ముందుకొస్తామని... ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం-నవశకం’ సభ ద్వారా టీడీపీ-జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. పొత్తుపై ఇరు పార్టీల అధినేతలు ఈ వేదికపై నుంచి రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చారు. పవన్‌, బాలకృష్ణ సభకు హాజరై కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

Tags

Next Story