CBN: రామరాజ్య స్థాపనకు కదిలిరండి

CBN: రామరాజ్య స్థాపనకు కదిలిరండి
X
ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు పిలుపు.. కారణ జన్ముడికి నివాళులు అర్పించిన లోకేశ్‌

దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఒకే ఒక జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని చంద్రబాబు అన్నారు. తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది.. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన వెలుగు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పేదరికం లేని, కులమతాలకు అతీతమైన సమ సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ.. రామరాజ్య స్థాపనకు మనందరం కదలాలని పిలుపునిచ్చారు. అందుకే ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా’ అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా.. నేను ‘రా... కదలిరా’ అని పిలుపునిచ్చానని అన్నారు. తెలుగు ప్రజలారా రండి.. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.మరోవైపు తెలుగుజాతి ఖ్యాతి, మహానాయకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.‌ కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు అర్పించారు.


గుడివాడ అడ్డా టీడీపీ అడ్డా

కృష్ణా జిల్లా గుడివాడలోNTR వర్థంతి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోకి అనుమతి లేదంటూ తెలుగుదేశం,జనసేన శ్రేణుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. NTR విగ్రహం వద్దకు వెళ్లరాదంటూ బారికేడ్లు అడ్డుపెట్టారు. మహనీయుడి వర్ధంతి రోజు ఆయన విగ్రహానికి దండ వేయనీయకుండా అడ్డంకులేంటంటూ పోలీసులతో తెలుగుదేశం, జనసేన శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. కొడాలి నానికి అనుమతి ఇచ్చి...తమను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. NTRకు నివాళులర్పించేందుకు గుడివాడ తెలుగుదేశం కార్యాలయానికి భారీగా చేరుకొన్న తెదేపా, జనసేన కార్యకర్తలు బైకు ర్యాలీకి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించాల్సిందేనంటూ వెనిగండ్ల రాము బయలుదేరగా..పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు తెలుగుదేశం- జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఆగ్రహంతో బారికేడ్లను వాహనాలతో తెలుగుదేశం, జనసేన శ్రేణులు గుద్దుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వైపు దూసుకెళ్లారు.

Tags

Next Story