TDP-JANASENA-BJP: పొత్తును ఆశీర్వదించండి

TDP-JANASENA-BJP: పొత్తును ఆశీర్వదించండి
మూడు పార్టీల సంయుక్త ప్రకటన... ఆంధ్రప్రదేశ్‌ బాగు కోసమే కూటమన్న చంద్రబాబు

తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిని ప్రజలు అశీర్వదించి.. అధికారం కట్టబెట్టాలని చంద్రబాబు.. ప్రజలకు పిలుపునిచ్చారు. భాజపా-తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని ట్వీట్ చేసిన చంద్రబాబు.. ఈ మహత్తరమైన ముందడుగుతో ఏపీ ప్రజల భవిష్యత్తుకు బాటలు పడ్డాయని అన్నారు. చంద్రబాబు నివాసంలో భేటీ అయిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్ , భాజపా జాతీయ నేత జైజయంత్ .. పొత్తు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు 3 పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏపీలో లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో..... భాజపా, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తాయని... వన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం జరిగిందన్న పవన్ ... సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని... అదే ఉద్దేశంతో మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని వెల్లడించారు. ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాదిపడిందని పవన్ అన్నారు. ఎన్.డి.ఏ. భాగస్వాములుగా ఏపీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటామని వివరించారు.


తెలుగుదేశం-జనసేన-బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలింది. మూడు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కివచ్చింది. టీడీపీ-144, జనసేన-21, బీజేపీ -10 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. అలాగే... తెలుగుదేశం-17, బీజేపీ-6, జనసేన-2 లోక్‌సభ స్థానాల్లో పోటిచేయనున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా సాగిన సుదీర్ఘ చర్చల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కేంద్ర మంత్రి షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పండాలు ఈమేరకు నిర్ణయానికి వచ్చారు.

తెలుగుదేశం, జనసేన, భాజపా మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు.. ముగింపు దశకు చేరుకున్నాయి. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నర్సాపురం, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో... బీజేపీ పోటీ చేయనుండగా, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానాల్లో.. జనసేన బరిలోకి దిగనుంది. మిగతా 17 లోక్‌సభ స్థానాల్లో.. తెలుగుదేశం పోటీ చేయనుంది. చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాలకు బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. నేడు బీజేపీ ప్రకటించే రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో... ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story