NARA FAMILY: చంద్రబాబును జైల్లో ఎందుకు పెట్టారు

NARA FAMILY: చంద్రబాబును జైల్లో ఎందుకు పెట్టారు
నిలదీసిన భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి... కొనసాగుతున్న ఆందోళనలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినందుకు జైల్లో పెట్టారా అని నిలదీశారు. ట్విట్టర్‌లో CBN జైల్డ్‌ ఫర్‌ డెవలపింగ్‌ ఏపీకి మద్దతుగా ఆమె ట్వీట్‌ చేశారు. ప్రజలు ఆనందంగా ఉండాలని, ఉన్నతంగా జీవించాలని..తపించినందుకు చంద్రబాబును అరెస్ట్‌ చేశారా అని ప్రభుత్వాన్ని భువనేశ్వరి ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సంఘీభావం తెలుపుతున్న ప్రతీ ఒక్కరి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అసలు చంద్రబాబు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారనే ఆవేదన ప్రజల్లోనూ, పార్టీ కార్యకర్తల్లో ఉందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినందుకా అని ప్రశ్నించారు. లేక ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా అని నిలదీశారు. అదే తప్పైతే ఇక ప్రజలకు దిక్కెవరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రజల కోసం తలపెట్టిన పనులనే నేరాలంటున్నారని నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మాణి కూడా ట్వీట్‌ చేశారు. ఫైబర్‌నెట్‌, స్కిల్ ప్రాజెక్టులు చంద్రబాబు ప్రజల కోసం తలపెట్టారన్న ఆమె సాగునీటి ప్రాజెక్టులపై నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసులు చూస్తుంటే అభివృద్ధి చేసినందుకే జైల్లో పెట్టినట్లు స్పష్టం అవుతోందన్నారు. సీఎంగా ప్రజా ఉపయోగ పనులు చేస్తే... దానినే తప్పు అనేలా రాజకీయం దిగజారిందని బ్రాహ్మణి విమర్శించారు. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అంతా గ్రహించాలని సూచించారు.


చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు 'బాబుతో నేను' పోస్టర్లను ప్రదర్శించి నిరసన తెలిపారు. బాబు పోస్టర్‌కు పాలాభిషేకం చేసి మద్దతు తెలిపారు. G.V.M.C గాంధీ విగ్రహం వద్ద మహిళలు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నినాదాలు చేశారు. ముత్యాలతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు.

చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ కూర్మన్నపాలెంలో కార్పొరేటర్‌ కోటేశ్వరరావు శ్రీ మన్యు రుద్ర మహా పాశుపత శాంతి హోమం నిర్వహించారు. మంత్రోచ్చారణల మధ్య వేద పండితులు సుమారు ఆరు గంటల పాటు తంతు జరిపారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో దీక్షా శిబిరాన్ని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. బాబు అరెస్టును నిరసిస్తూ చెరసాల లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అందులో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story