LOKESH: బస్సు ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత

LOKESH: బస్సు ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత
కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు... ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్‌

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. బాధాకరమని తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రమాదానికి జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే ఏపీలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైకాపా అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని లోకేశ్ ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల నుంచి ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయనందున ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని లోకేశ్ వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన ఓ చిన్నారి చికిత్ప పొందుతూ చనిపోయాడు. విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరు వెళ్లేందుకు బస్టాండ్ లోని పన్నెండో ప్లాట్ ఫాం వద్దకు వస్తూ ఉన్నట్టుండి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ వేగానికి బస్సు చక్రాల కింద పడి గుంటూరు-2 డిపోలో పనిచేసే ఒప్పంద ఉద్యోగి వీరయ్య, చీరాల వెళ్లేందుకు వచ్చిన మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆ మహిళ మనవడు అయాన్స్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఆమె కోడలు కాలువిరిగింది. ఈ ఘటనలో ప్రాంగణంలోని దిమ్మెలు, ఫెన్సింగ్, టీవీ, కుర్చీలు ధ్వంసం కాగా..దుకాణాల్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి. యాక్సలరేటర్ పట్టేసినందున... కదల్లేదని, రివర్స్ గేర్ బదులు ఒకటో గేర్ వేశానని బస్సు డ్రైవర్ చెబుతున్నారు. అటు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన RTC ఎండీ ద్వారకా తిరుమలరావు మృతుల కుటుంబాలకు RTC తరఫున ఐదేసి లక్షల పరిహారంప్రకటించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు... వైద్య సాయం అందిస్తామన్నారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం జగన్ మృతుల కుటుంబాలకు పదేసి లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది.

Tags

Read MoreRead Less
Next Story