LOKESH: అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం

LOKESH: అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం
జగన్‌ కక్షపూరిత విధానాలను గవర్నర్‌కు వివరించిన టీడీపీ... సైకోను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న లోకేశ్‌...

జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలుగుదేశం నేతల బృందం గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, చేస్తోన్న సామాజిక అన్యాయంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, ధూళిపాళ్ల నరేంద్ర గవర్నర్‌ను కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ప్రతిపక్షాలపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గవర్నర్‌కు లోకేష్ వివరించారు. వైసీపీ పాలనలో దక్షిణ భారత బిహార్‌గా ఏపీ మారిందని నారా లోకేశ్‌ విమర్శించారు.


వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందని లోకేశ్‌ ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరామన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రజల కోసం పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. భయం మా బయోడేటాలోనే లేదు.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం. దొంగ ఓట్లు చేర్చడంపై మా పోరాటం కొనసాగిస్తామని లోకేశ్‌ అన్నారు. ముఖ్యమంత్రి పేరుపైనా దొంగ ఓట్లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం నేడు ఎన్నికల సంఘాన్ని కలుస్తుందని లోకేశ్‌ తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వివరిస్తామన్నారు. రూ.150 కోట్లను అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్టు వైసీపీ ఖాతాలో ఉందన్నారు. జనసేనతో సంప్రదింపులు జరిపామని.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామి వెల్లడింజారు.


ప్రతిపక్ష నేతలపైనే కాకుండా వివిధ వర్గాలకు చెందిన వారిని ఎలా వేధిస్తోన్నారో వివరించామన్నారు. న్యాయ వ్యవస్థపై వైసీపీ చేసిన దాడులు.. 17-ఏ అంశాన్ని పట్టించకోకుండా చంద్రబాబును ఏ విధంగా అరెస్ట్ చేశారోననే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని లోకేశ్‌ తెలిపారు. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని.. సైకో జగన్‌ను ఎదుర్కొవడానికి ఏం ప్రిపరేషన్ ఉంటుందని అన్నారు. ప్రజలే యుద్ధం చేయడానికి ప్రిపేర్డుగా ఉన్నారన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై క్లారిటీ వచ్చాక.. భవిష్యత్ కార్యాచరణ ఫిక్స్ చేస్తామని తెలిపారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన వ్యక్తి సీఎం జగన్ అని విరుచుకుపడ్డారు. కరవుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. తాగునీటి సమస్య కూడా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story