Nara Lokesh: మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ.8,300 కోట్ల అప్పు: నారా లోకేష్

Nara Lokesh: మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ.8,300 కోట్ల అప్పు: నారా లోకేష్
Nara Lokesh: జగన్‌ చెప్పిన మద్య నిషేధం ఎటుపోయిందంటూ ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Nara Lokesh: జగన్‌ చెప్పిన మద్య నిషేధం ఎటుపోయిందంటూ ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎన్నికల ముందు మద్యనిషేధం అని చెప్పి.. సీఎం అయ్యాక సంపూర్ణ మద్యపాన ప్రదేశ్‌గా చేశారంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్యనిషేధం అనే ఊసే ఉండబోదంటూ.. మద్యం రాబడిని రాసిచ్చి మరీ.. మందు బాబుల్ని తాకట్టు పెట్టి మరీ 8వేల 300 కోట్లు అప్పు తెచ్చారంటూ జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఇక జగన్ బ్రాండ్లతో ఎన్ని వేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తోందన్నారు నారా లోకేష్. మద్యం రాబడిని హామీగా పెట్టిన జగన్‌ సర్కార్‌.. ఏకంగా 8వేల 300 కోట్ల రూపాయల రుణం తెచ్చింది.

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లను మార్కెట్లో అమ్మి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. పైగా రాష్ట్రంలో మద్య నిషేధం పెట్టేదేలేదని అప్పు తీసుకున్న దగ్గర ప్రభుత్వమే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలంటే తీసుకున్న 8వేల 300 కోట్ల రూపాయలను 9.6 శాతం వడ్డీతో సహా కట్టాలి. ఈ అప్పు తీర్చడం జగన్ ప్రభుత్వానికి అసాధ్యం అనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మద్యంపై 19వేల 500 కోట్ల ఆదాయం రాబట్టింది జగన్ సర్కార్. అందుకే, కొంతకాలంగా మద్యనిషేధంపై మాట మారస్తూ వస్తోంది. రాష్ట్రంలో మద్యనిషేధం విధించట్లేదు, మద్య నియంత్రణ తీసుకొస్తున్నాం అంటూ ప్రకటనలు ఇస్తోంది.

అంటే, ఎన్నికలు వచ్చే నాటికి కేవలం స్టార్‌ హోటళ్లలోనే దొరకాల్సిన మద్యాన్ని.. ఎప్పటిలాగే వీధివీధినా ప్రభుత్వమే అమ్ముతుందని చెప్పకనే చెప్పింది. ఏపీలో మద్యనిషేధం ఉండబోదని స్పష్టమైన సంకేతాలిచ్చింది జగన్ సర్కార్. ఎన్నికల ముందు జగన్‌ ఊరూరా తిరుగుతూ ఇచ్చిన హామీపై చేతులెత్తేశారు. మద్యనిషేధంతో ఏ ఆడబిడ్డల కన్నీరు తుడుస్తానని, మాంగళ్యాలు నిలబెడతానని చెప్పారో.. ఇప్పుడు అదే మద్యం విక్రయాలతో అమ్మఒడి, చేదోడు, చేయూత పథకాలను నడుపుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story