31 కేసుల నుంచి తనను తప్పిస్తే చాలని.. 28 ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారా?: లోకేష్
అదే అన్యాయం.. ఏటా జరిగే తంతే ఏపీ విషయంలో ఈసారి కూడా జరిగింది. కొత్త ప్రాజెక్టులు కనిపించలేదు. ప్రస్తుతం కొనసాగిస్తున్న ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కేటాయించలేదు..

అదే అన్యాయం.. ఏటా జరిగే తంతే ఏపీ విషయంలో ఈసారి కూడా జరిగింది. కొత్త ప్రాజెక్టులు కనిపించలేదు. ప్రస్తుతం కొనసాగిస్తున్న ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కేటాయించలేదు.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ప్రత్యేక ప్యాకేజీ నిధుల గురించి ప్రస్తావనే లేదు. రాజధాని నగరం అమరావతి పేరే బడ్జెట్‌లో వినబడలేదు. రాజధానిని విశాఖకు తరలిస్తామని వైసీపీ నేతలు డప్పు కొట్టుకున్నా.. దానికి కూడా నయా పైసా తీసుకురాలేకపోయారు.
లక్షల కోట్ల బడ్జెట్ అని కేంద్రం గొప్పలు చెప్పుకున్నా ఈసారి కూడా ఏపీకి దక్కింది మొండిచేయే.. కేంద్ర బడ్జెట్ ఏపీని తీవ్ర నిరాశకు గురిచేసింది..అధికారంలోకి రాకముందు 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్.. ఇప్పుడు నిధుల మాటే ఎత్తడం లేదు.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ మాట వినిపించకపోవడంపై విపక్షాలు ఫైరవుతున్నాయి.. చేతగాని జగన్ సర్కార్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వైసీపీకి 28 మంది ఎంపీలున్నా కనీసం ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేసుకోలేకపోయారని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. ఏపీలో ఏ రాజధానికి కేటాయింపులు చేయాలో తెలియని స్థితిలో కేంద్రం ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.. వైసీపీ నేతలు ఏపీకి రాజధాని ఏదో కేంద్రానికి చెబితే బాగుండేదన్నారు. జనాన్ని మోసం చేసే జగన్ రెడ్డి మరోసారి రాష్ట్రాన్ని దగా చేశారని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికి.. తనను 31 కేసుల నుంచి తప్పిస్తే చాలు.. ప్రత్యేక హోదా ఊసెత్తనని 28 ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీలకు బాబాయ్ హత్యకేసుతో కేంద్రం చెల్లు చేసిందన్నారు. అప్పులు వాడుకోవడానికి అనుమతిస్తే చాలు, ఏ ప్రాజెక్టులు ఇవ్వకపోయినా ఫర్వాలేదని జగన్ ఒప్పందం చేసుకున్నారా అంటూ లోకేష్ నిలదీశారు.