LOKESH: తాడేపల్లి తలుపులు బద్దలు కొడతాం

LOKESH: తాడేపల్లి తలుపులు బద్దలు కొడతాం
వైసీపీది కోడికత్తి వారియర్స్‌... పొత్తు చూసి జగన్‌ భయపడుతున్నారన్న లోకేశ్‌..

సీఎం జగన్ ను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని లోకేశ్ ఉద్ఘాటించారు. 160 స్థానాల్లో తెలుగుదేశం - జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు సూచించారు. యువగళం... ముగింపు సభ కాదు ఆరంభం మాత్రమే అన్నారు. తాడేపల్లి తలుపు బద్దలు కొట్టేవరకు... ఈ యుద్ధం ఆగదని స్పష్టం చేశారు. ఇది నవశకం.. యుద్ధం మొదలైందని, తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని... రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని.. ఇది యువగళం.. మనగళం.. ప్రజాగళమని లోకేశ్‌ అన్నారు. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరని... లోకేశ్‌ది అంబేడ్కర్‌ రాజ్యాంగం పౌరుషమని అన్నారు. యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే అని... చంద్రబాబు, పవన్‌ను చూస్తే జగన్‌ భయపడతారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని... విజనరీ అంటే చంద్రబాబు.. ప్రిజనరీ అంటే జగన్‌ అన్నారు. రూ.లక్ష కోట్లు దోచేసిన వ్యక్తి పేదవాడు అవుతారా అని ప్రశ్నించారు. జగన్‌ అహంకారం.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో చూపాలన్నారు.


ఆడుదాం ఆంధ్రా అంటూ జగన్‌ కొత్త పథకం తెచ్చారని.. తమ జీవితాలతో ఆడారని ప్రజలు చెబుతున్నారని లోకేశ్‌ అన్నారు. జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు కోడికత్తి వారియర్స్‌ అని... కోడికత్తి వారియర్స్‌ ఆటగాడు అవినాష్‌రెడ్డి. బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌.. అరగంట స్టార్‌ అంబటి. గంట స్టార్‌ అవంతి.. ఆల్‌ రౌండర్‌ గోరంట్ల మాధవ్‌. రీల్‌ స్టార్‌ భరత్‌.. పించ్‌ హిట్టర్‌ బియ్యపు మధుసూదన్‌రెడ్డి అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని... అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించిందన్నారు. రాజధానిని చంపి జగన్‌ రాక్షసానందం పొందారని... గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడతామని లోకేశ్‌ వివరించారు.


లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి తెదేపా, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ విజయోత్సవ సభ వేదికగా...... తెలుగుదేశం-జనసేన ఎన్నికల శంఖారావంపూరించాయి. యువగళం ముగింపు సభకు లక్షలాదిగా..తెలుగుదేశం-జనసేన కార్యకర్తలుతరలిరాగా.....రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ , ముఖ్యనేతలు వైకాపా సర్కారుపై సమరభేరి మోగించారు.

Tags

Next Story