LOKESH: ఏపీతో వేరే రాష్ట్రాలకు పోటీ తప్పదు
2019లో మంత్రిగా పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటానని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, RTG శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేసిన గత అనుభవం ఇప్పుడు జీవనోపాధి, విద్యను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు. యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలు, నైపుణ్యం కల్పించడానికి తాజా ప్రయాణాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. ఈసారి ఉద్యోగ కల్పనలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన పోటీ ఇస్తుందని లోకేష్ అన్నారు.
పోలవరానికి చంద్రబాబు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణ ప్రారంభించిన చంద్రబాబు..సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమైన సీఎం పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు సిద్దమవుతోన్న చంద్రబాబు గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారు.సమయపాలన కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్న ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నిరంతరం సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు కూడా.. చంద్రబాబు సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పోలవరం పర్యటన పూర్తయ్యాక శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్‌కే పెద్దపీట
మంత్రి శాఖల కేటాయింపులో పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు పెద్దపీట వేశారు. 2014-19 మధ్య ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వగా... ఈసారి పవన్‌కల్యాణ్ ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ శాఖలు లోకేశ్ నిర్వహించారు. లోకేశ్ గతంలో నిర్వర్తించిన ఐటీశాఖతోపాటు విద్య, రియల్‌టైం గవర్నెన్స్ శాఖలు కేటాయించారు. ప్రతిపక్షంలో ఉండగా పో లీసుల నుంచి అనేక వేధింపులు ఎదుర్కొవడంతోపాటు, ఎస్సీ నేత అయి ఉండి కూడా అట్రాసిటీ కేసు ఎదుర్కొన్న వంగలపూడి అనితకు ఇప్పుడు అదే పోలీసులు సెల్యూట్ చేసేలా హోంశాఖను కేటాయించారు. మంత్రులతోపాటు, రాష్ట్ర ప్రజల ఉత్కంఠకు తెరదించుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులకు శాఖలను కేటాయించారు. సాధారణ పరిపాలనతో పాటు శాంతిభద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంచుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com