ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వెయ్యండి : నారా లోకేష్

కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయడం చేయాలని సీఎం జగన్‌కి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో 15 లక్షల మందికిపైగా విద్యార్థులు 10, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉందని, వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమమని లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో టీకా పంపిణీ తక్కువగా ఉంది కాబట్టి.. ఈ సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడి నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే మంచిదన్నారు లోకేష్. రెండో దశ కోవిడ్ ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతోందని, మరణాల రేటు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, వెంటిలేటర్ల కొరత కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రజలు కోవిడ్ బారిన పడకుండా నివారించవచ్చని లోకేష్ లేఖలో ప్రస్తావించారు.
కేంద్రం ఇప్పటికే CBSE పరీక్షలను రద్దు చేసిందని, తెలంగాణ ప్రభుత్వమూ పదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసిందని CM దృష్టికి తెచ్చారు. అన్నింటిపై సమీక్షించి పరీక్షలపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com