LOKESH: చంద్రబాబు హత్యపై బహిరంగంగానే వ్యాఖ్యలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా నిర్బధించిన సైకో జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయన బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఇందులో నిజం లేకుంటే పదేళ్ల నుంచి జగన్ ఎలా బయట ఉన్నారని ప్రశ్నించారు. స్కిల్ కేసులో దమ్ముంటే 50 రోజుల నుంచి ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు చూపించలేకపోయారని ప్రశ్నించారు. రాజమండ్రి జైళ్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును తల్లి భువనేశ్వరి, తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో కలిసి ములాఖత్‌లో లోకేశ్ కలిశారు. ఆ తర్వాత మాట్లాడిన లోకేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులకు సంబంధించి వైకాపా ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు.ఇన్ని రోజుల నుంచి చంద్రబాబును జైళ్లో పెట్టిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఆధారాన్నీ ఎందుకు చూపలేకపోయిందని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నందునే చంద్రబాబు జైళ్లో ఉన్నారని లోకేశ్ ఆరోపించారు. జగన్, అవినాశ్‌రెడ్డివంటివారు బయట తిరుగుతున్నారని అన్నారు. చంద్రబాబు చనిపోవాలి, చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారంటే రాజమండ్రి జైళ్లో చంద్రబాబుకు భద్రత లేదని స్పష్టమవుతోందని లోకేశ్ అన్నారు.
చంద్రబాబును బయటకు రానీయకుండా లాయర్ ఫీజుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న లోకేశ్... ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అయినా రైతులను పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. రైతుల కోసం కాకుండా బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్నారన్న లోకేశ్.. నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతోందన్నారు. వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సును ఆపి డ్రైవర్‌పై దాడి చేశారని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయన్నారు. దాడి చేసిన వారిపై ఇంతవరకు చర్యలు లేవని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీని చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపితే.. జగన్ మాత్రం కక్ష సాధింపులతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. స్కిల్, ఇన్నర్‌రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో న్యాయవాదుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ ప్రజాసమస్యల పరిష్కారానికి రూపాయి కూడా ఎందుకు వెచ్చించడం లేదని లోకేశ్ నిలదీశారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారని ప్రశ్నించారు. కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా... స్కిల్, ఫైబర్‌నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా... అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైనా చూపారా?ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానని లోకేశ్ అన్నారు. స్కిల్ కేసులో తమ కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని, తమ ఆస్తులు, ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com