Andhra Pradesh: ఆనాడు విమర్శించారు.. ఇప్పుడు అదే చేస్తున్నారు.. జగన్ ప్రభుత్వంపై ప్రజల అసహనం..

Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో జగన్ స్లోగన్.. బాదుడే బాదుడు. చేతిలో మైక్ పట్టుకుని, ఊరూరా తిరుగుతూ, ప్రత్యేకమైన రాగం తీస్తూ... కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోల్-డీజిల్ రేట్లు ఇలా బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేశారు. ఆనాడు జగన్ ఏవైతే బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారో.. ఇప్పుడు వాటినే ఒక్కొక్కటిగా పెంచుతూ పోతున్నారు.
వైఎస్ పాలన కంటే గొప్పగా పాలించి చూపిస్తానన్న జగన్.. జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం విధించనంత పన్నులను పెట్రోల్,డీజిల్‌పై విధిస్తూ జనం జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇసుకపై, మద్యంపై, చెత్త పన్ను పేరుతో సరికొత్త బాదుడు, ఆస్తి పన్నుతో వీర బాదుడు, ఓటీఎస్ పేరుతో మరోరకం బాదుడు. తాజాగా ఏడోసారి కరెంట్ ఛార్జీలు పెంచుతూ తన వీర బాదుడు ఎలా ఉంటుందో జనాలకు ఉగాది రుచులు చూపిస్తున్నారు జగన్.
పథకాలు నడపడం కోసం మద్యం అమ్మకాలు విచ్చల విడిగా పెంచేస్తున్నారు. మద్యం రాబడికి టార్గెట్లు పెడుతున్నారు. అది చాలదన్నట్టు.. ఇప్పుడు పన్నులు పెంచి, ఛార్జీలు వడ్డించి జనం నుంచి పిండుకుంటున్నారు. సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసిన జగన్.. ఆ పథకాల నిధుల కోసమే ఇలా ఛార్జీల భారం మోపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ మీటర్ నొక్కగానే డబ్బులు పడాలంటే.. ఇలా జనం నుంచి వసూలు చేయాల్సిందేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలు.. ఇలా షాపులున్న ప్రతిఒక్కరికి ప్రతి ఏటా 10వేల ఆర్ధిక సాయం వేయాలన్నా, అమ్మ ఒడి కింద ప్రతి తల్లికి 14వేలు ఇవ్వాలన్నా.. ఏదో ఒకరకంగా జనాన్ని బాదితేనే పథకాలు ఇవ్వగలిగే స్థితిలో జగన్ ఉన్నారంటూ విపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి.
ఏప్రిల్ వస్తే వసతి దీవెన, వడ్డీలేని రుణాలు, మే నెలలో విద్యా దీవెన, రైతు భరోసా, సాగు బీమా, జూన్‌లో అమ్మ ఒడి పథకం, జూలైలో విద్యా కానుక, జగనన్న తోడు, ఆగస్ట్‌లో విద్యా దీవెన, నేతన్న నేస్తం, సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత, అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా, నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు, డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు, మళ్లీ మార్చి వచ్చే సరికి వసతి దీవెన.
వీటన్నింటికీ వేల కోట్ల రూపాయల నిధులు కావాలి. రాష్ట్రం ఆదాయం ఘనంగానే కనిపిస్తున్నప్పటికీ.. అప్పులకు కట్టాల్సిన వడ్డీలు, సంక్షేమ పథకాల్లో భాగంగా అకౌంట్లలో వేయాల్సిన డబ్బులు, జీతాలు, బిల్లులకే సరిపోవడం లేదు. అందుకే, అదనపు ఆదాయం కోసం ఇలా ఛార్జీల భారం మోపుతున్నారని సామాన్యులు సైతం విమర్శించడం మొదలుపెట్టారు. ఒక చేత్తో డబ్బులు ఇస్తూ, మరో చేత్తో పన్నులు, ఛార్జీల రూపంలో వసూలు చేసుకుంటున్నారని జనం మాట్లాడుకుంటున్నారు.
నవరత్నాలు పేదల కోసమే తీసుకొచ్చానన్న జగన్.. కరెంట్ ఛార్జీల విషయంలో ఆ పేదలను కూడా వదల్లేదు. 30 యూనిట్లు కాల్చినా సరే ఇకపై యూనిట్‌కు అర్ధ రూపాయి పెంపుతో కొత్త బిల్లు కట్టాల్సిందే అంటోంది జగన్ ప్రభుత్వం. విచిత్రం ఏంటంటే 400 యూనిట్ల పైన వాడే ధనికులకు కూడా అటుఇటుగా అర్ధ రూపాయే పెంచారు. ఓవరాల్‌గా పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ ఛార్జీలను దాదాపు 45 శాతం పెంచింది జగన్ సర్కార్.
తెల్లారిందంటే చాలు... జగన్ ఏ పన్నులు విధిస్తారో, ఏ ఛార్జీలు పెంచుతారోనని ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ఎప్పుడో కట్టిన పాత ఇళ్లకు ఓటీఎస్ పేరుతో పేద ప్రజల నుంచి 339 కోట్లు పిండుకున్నారు. అధికారంలోకి రాగానే పోల్ ట్యాక్స్ రద్దు చేస్తానన్న జగనే.. ఒక్కో పోల్‌కు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెత్త పన్ను కట్టకపోతే జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. గుండె దడ పుట్టించేలా ఆస్తిపన్ను విధించారు. షాక్ కొట్టే రీతిలో కరెంటు ఛార్జీలు బాదారు. మొత్తంగా పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని మోపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com