Nellore: కంచుకోటలే ... పేకమేడలై...

Nellore: కంచుకోటలే ... పేకమేడలై...
నెల్లూరులో వణుకుతున్న సింహం...

ఆ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఏ నియోజకవర్గంలో చూసినా బలమైన నేతలే... ఒకరిని మించిన వారు ఇంకొకరు. 2014 నుంచి వైసీపీ హవానే సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సీట్లన్నీ ఆపార్టీవే.. కానీ ఎన్నికలు ఏడాదిలో ఉన్న తరుణంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కంచుకోటలనుకున్న నియోజకవర్గాలే పేకమేడల్లా కూలిపోతున్నాయి. ప్రజల్లో పేరున్న ఎమ్మెల్యేలు ఫ్యాన్ ఏమాత్రం ఆరోగ్యకరం కాదనుకుని సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇదీ సింహపురి గా పిలిచే నెల్లూరు జిల్లా లో పరిస్థితి. సింహం సింగిల్ అంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న సింహపురి జిల్లాలో మాత్రం సింహం వణికిపోతోంది. ఆ సింహాన్ని వణికిస్తోంది.

సొంత పార్టీ ఎమ్మెల్యేలే ... ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ , ఎంపీలు కానీ ఎన్నికలొస్తున్నాయంటే మరోసారి పోటీకి సిద్దమవుతుంటారు. పార్టీ మళ్ళీ టిక్కెట్టు ఇస్తుందో లేదో అని ఆందోళన పడుతుంటారు. పార్టీ అధిష్టానం మెప్పుకోసం ప్రయత్నాలు చేసుకుంటుంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రం మీ సీటు వద్దు మీ పార్టీ వద్దు బాబోయ్ అని దండం పెడుతున్నారు కొంతమంది వైసీపీ వదిలి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతుంటే కొందరు పార్టీలో ఉంటాం కానీ పోటీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ బాగా బలహీనంగా ఉన్న జిల్లా ఏదంటే అంతా టక్కున చెప్పేపేరు నెల్లూరే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకొచ్చి చంద్రబాబు సీఎం అయినా ఈ జిల్లాలో సైకిల్ సవారీ సాగలేదు.ఆ ఎన్నికల్లో మొత్తం పది సీట్లకు గాను వైసీపీ ఎనిమిది దక్కించుకుంది. టీడీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. లోక్ సభ సీటు కూడా ఫ్యాన్ పార్టీకే చిక్కింది. 2019 లో మొత్తం పది సీట్లనూ వైసీపీ గెలుచుకుంది. ఒక్క నెల్లూరు సిటీలో మాత్రం స్వల్ప మెజార్టీతో బయటపడగా మిగతా చోట్ల భారీ ఆధిక్యాన్ని సాధించింది. లోక్ సభ సీటును కూడా లక్షన్నర మెజార్టీతో గెల్చుకుంది. అటువంటి జిల్లాలో వైసీపీ కి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి.

ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లది పార్టీ లో తిరుగుబాట అనే కంటే ప్రజా తిరుగుబాటుగా చూడొచ్చు. తమకు ఎదురే లేదనుకున్న జిల్లాలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు వీరిద్దరి నిర్ణయాలు అద్దంపడుతున్నాయి. గత ఆరు నెలలుగా సందర్భం వచ్చినప్పుడల్లా ఆనం రామనారాయణ రెడ్డి జగన్ సర్కారు తీరుపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. అవన్నీ నియోజకవర్గ, రాష్ట్ర అభివ్రుద్ధి కి సంబంధించిన అంశాలే. వాటిని వైసీపీ ప్రభుత్వ ఏనాడూ పాజిటివ్ గా తీసుకోలేకపోయింది. కనీసం ఆయన్ను పిలిచి సమస్యలపై

మాట్లాడలేదు. బహుశా 2019 ఎన్నికల్లో గెలిచాక ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం జగన్ ఒక్క సారి కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదేమో. ఆనం కుటుంబానికి జిల్లాలో పెద్ద చరిత్ర ఉంది.

ఆనం రామనారాయణ రెడ్డే నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అయిదారు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది. అటువంటి నేత పట్ల జగన్ వైఖరిని వెంకటగిరి ప్రజలే కాదు సింహపురి వాసులంతా తప్పుపుడుతున్నారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే జగన్ కంటే ముందే గడప గడప కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎమ్మెల్యే. నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న నేత. అటువంటి ఈయనను జగన్ ఏనాడూ గుర్తించిన పాపాన పోలేదు. ఏ పదవీ ఆయనకు దక్కలేదు. తన లాంటి జననేతలకు జగన్ దగ్గిర స్థానం లేదనే ఆయనకు అర్దమై తన దారి ఎంచుకున్నారు. ఆయన టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. జనవరి నెలాఖరులో నే దీనికి సంబంధించిన

ఒక భేటీ జరిగినట్లు సమాచారం. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి పొగబెట్టి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని వెంకటగిరికి ఇన్ చార్జిగా పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్ధిగా చెబుతున్నారు. ఆది నుంచి వై.ఎస్. కుటుంబానికి వీరవిధేయుడైనా తనను మానసికంగా ఇబ్బందిపెట్టారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ గురించి ఆయన ఏకంగా ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులునే టార్గెట్ చేశారు. జగన్ చెప్పకుంటే ఆయన చేసి ఉంటారా అంటూ సీఎంపైనా బాణం గురిపెట్టారు. రాబోయే రోజుల్లో కోటంరెడ్డి నుంచి వచ్చే మాటల తూటాలు వైసీపీని నేతలకు దడపుట్టిస్తాయంటున్నారు. పార్టీకి ఎదురేలేదనుకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఇంతగా ఎదురుతిరగడంతో తాడేపల్లి పెద్దలకు దిక్కుతోచడంలేదు. కోటంరెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తారనేది అర్దమవుతూనే ఉంది. ఇక ఆనం రామనారాయణరెడ్డిదీ అదే బాట. అయితే వెంకటగిరిలో ఉంటారా ఆత్మకూరు వెళ్తారా అన్నదే ప్రశ్న. వీరిద్దరి వల్ల వైసీపీ నుంచి రెండు సీట్లు పోయినట్లే లెక్క.ఇది ఇంతటితో ఆగుతుందా అంటే ఆగేలా లేదు. ఏ నియోజకవర్గంలో చూసినా ఇటువంటి పరిస్థితులే. నెల్లూరు సిటీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఈసారి సీటు ఇస్తామన్నా పోటీచేసేందుకు భయపడుతున్నారు. నా అనుకున్న వాళ్ళంతా దూరమైన స్థితిలో ఈసారి పోటీకి దూరంగా ఉంటారంటున్నారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుటుంబ కధా చిత్రమ్ తో అన్ పాపులర్ అయ్యారు. ఆయనకు టిక్కెట్టు కష్టమే. మరో గట్టి అభ్యర్ది కూడా కనిపించడంలేదు. ఉప ఎన్నికతో గెలిచిన మేకపాటి విక్రమ్ రెడ్డి గడప గడపకూ వెళ్తుంటే ఆయనకూ పరిస్థితి బోధపడుతూనే ఉంది. గూడూరులో వరప్రసాద్ కి ఈసారి సీటు లేదని సొంత పార్టీ వాళ్లే బాహాటంగా చెబుతున్నారు. కోవూరులో నల్ల పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వ పనితనంపై వివిధ సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు స్రుష్టిస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలతో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కి ఈసారి టిక్కెట్టు లేదంటున్నారు. నెల్లూరు లోక్ సభ సీటు రచ్చ మరో రకంగా ఉంది ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి చాలా కాలంగా వైసీపీ అధిష్టానంపై అసంత్రుప్తిగా ఉన్నారు. ఈయన గతంలో టీడీపీ లో చురుకైన పాత్ర పోషించారు. టీడీపీలో లీడర్ల కు ఉండే స్వేచ్ఛ, ఆత్మాభిమానం లాంటివి ఇక్కడ ఏమాత్రం ఉండవనే అంశం ఆయను మొదట్లోనే బోధపడింది. అయినా ఏ నాడూ బయటపడకుండా లోలోనే మధనపడుతున్నారు. సన్నిహితుల వద్ద మాత్రం ఇదేం పార్టీ, ఇదేం ప్రభుత్వమని వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడానికి విముఖంగా ఉన్న ఆయనకు అధిష్టానం కూడా అదే షాక్ ఇస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి 2024 ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ సీటు ఖరారు చేశారట. వేమిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం 2024 మార్చితో పూర్తవుతుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వేమిరెడ్డికి లోక్ సభకు పోటీచేయడం ఇష్టంలేదు. ప్రజల్లో జగన్ సర్కారు పట్ల ఇంత వ్యతిరేకత ఉన్న వేళ ఈ సీటు నాకెందుకంటున్నారాయన. తనకు మరోసారి రాజ్యసభ సీటే ఇవ్వాలని జగన్ ని అడిగితే ఆయన నో అన్నారంట. .

వేమిరెడ్డి పదవీకాలం పూర్తయ్యాక ఖాళీ అయ్యే రాజ్యసభ సీటును ఈసారి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఇస్తానిని జగన్ చెప్పారట. దాంతో వేమిరెడ్డి కూడా జగన్ తీరుపై గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ నుంచి వైసీపీ గెలుపు సాధ్యం కాదనే భావనతో వేమిరెడ్డి ససేమిరా అంటున్నారు. ఆయన్ను ఒప్పించేందుకు అధిష్టానం తంటాలు పడుతోంది. ఇదే సమయంలో కోటంరెడ్డి తిరుగుబాటుతో ఖాళీ అవుతున్న నెల్లూరు రూరల్ కి ఆదాల ప్రభాకరరెడ్డిని పంపాలనే ఆలోచన చేస్తున్నారు. ఆదాల మాత్రం అసలు రాజకీయాలనుంచే తప్పుకుంటే

పోతుందనే నిర్వేదాన్ని ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఒక ఎన్ ఆర్ ఐ కి సంబంధించిన విందులో పాల్గొన్న సమయంలో వేమిరెడ్డి, ఆదాల, ఆనం రామనారాయణ రెడ్డిలు తమ ఆవేదనను పంచుకున్నారు. విశేషమేమంటే ఇదే విందులో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కూడా ఉన్నారు. ఆయన వీరికి సానుభూతి వచనాలు చెప్పారట. గేట్లు ఎత్తితే ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ నేతలు టీడీపీలోకి వరదలా వచ్చి పడే పరిస్థితి ఉందంటున్నారు. ఆపే శక్తి ఎవరికైనా ఉందా ? అలా ఏమీ కనిపించడం లేదు.

రావిపాటి....

Tags

Read MoreRead Less
Next Story