NIA RAIDS: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

NIA RAIDS: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు
60కిపైగా ప్రాంతాల్లో తనిఖీలు... పౌర హక్కుల నేతల ఇళ్లలో సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, కులనిర్మూలన సమితి, చైతన్య మహిళా సంఘాల నేతల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. వాళ్ల కుటుంబ సభ్యులనూ ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు, వాళ్ల కార్యకలాపాలకు సహకరిచండంపై ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో భవాని, న్యాయవాది సురేశ్‌ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో N.I.A అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు, జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు రాజారావు ఇంట్లో వేకువజాము నుంచే తనిఖీలు చేస్తున్నారు. కామామానులో మండలం కొండపాటూరులోని తమలపాకుల సుబ్బారావు నివాసంలో N.I.A సోదాలు చేస్తోంది. పౌరహక్కుల సంఘం నేత రాజారావుకు సన్నిహితంగా ఉండే సుబ్బారావు, ప్రజాతంత్ర పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఆయన మావోయిస్ట్ సానుభూతిపరుడనే అనుమానంతో సోదాలు చేస్తున్నట్లుతెలుస్తోంది.


అనంతపురం బిందెల కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కుల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు ఇంట్లో N.I.Aసోదాలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం అల్లిపురంలో జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు కావలి బాలయ్య ఇంట్లో తనిఖీలు సాగుతున్నాయి. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిపై బాంబు దాడి కేసులో... కావలి బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారు. నెల్లూరులోని A.P.C.L.C ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ దర్యాప్తు సంస్థ-N.I.A అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడిన వారితోపాటు, పౌరహక్కులు, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న వారి నివాసాలను జల్లెడ పడుతున్నారు. మంగళగిరి మండలం నవులూరులో చైతన్య మహిళా వేదిక సభ్యురాలు సిప్పోరా ఇంటితోపాటు తాడేపల్లి మండలం డోలాస్ నగర్ ప్రాంతాల్లో ప్రజాసంఘాల నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి మహానాడు 13వ రోడ్డులో ఉంటున్న బత్తుల రమణయ్య నివాసంలో తనిఖీలు చేస్తున్న N.I.A అధికారులు మావోయిస్ట్ కార్యకలాపాలకు సహకారంపై విచారణ చేస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ఓర్సు శ్రీనివాసరావు నివాసంలో సోదాలు సాగుతున్నాయి. కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు ఫతేఖాన్ పేట రైతుబజార్ సమీపంలో చైతన్య మహిళా సంఘం నేత అన్నపూర్ణమ్మ ఇంట్లో సోదాలు సాగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story