AP: చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ అయ్యింది. ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందానికి ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. స్వాగతం పలికారు. ఏపీ విజన్ 2047 సహా ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి నిర్మాణంపై చంద్రబాబు.. నీతి ఆయోగ్ బృందానికి మధ్య చర్చ సాగింది. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.ఏపీకి ఉన్న అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించుకోవడంతో పాటు పన్నుల్లో వాటా, వివిధ కేంద్ర ప్రయోజిత పధకాల్లో రావాల్సిన వాటాలపైన రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
వీటిపైనే చర్చ
ఏపీ ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్ బృందం చర్చ జరపనుంది. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, పయ్యావుల చర్చించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పనగారియాను సీఎం చంద్రబాబు, పయ్యావుల కలిసి కీలక అంశాలపై చర్చ జరిపారు
చంద్రబాబును కలిసిన థమన్
సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ కలిశారు. ఈ సందర్భంగా థమన్‌ను చంద్రబాబు సత్కరించారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న థమన్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. ఫండ్ రైజింగ్ కోసం నిర్వహిస్తున్న ఈ మ్యూజికల్ నైట్ కోసం థమన్ ఒక్క రూపాయి తీసుకోకుండా పూర్తి సేవా థృక్పథంతో పనిచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com