AP Employees : పీఆర్సీ నివేదికపై రాని స్పష్టత

AP Employees : పీఆర్సీ నివేదికపై రాని స్పష్టత
AP Employees : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం మంత్రుల కమిటీతో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

AP Employees : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం మంత్రుల కమిటీతో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీతో భేటీ తర్వాత సీఎం జగన్‌తోనూ ఉద్యోగసంఘాల నేతలు భేటీ కానున్నారు. కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయానికి రాగా...మరికొన్నింటిపై చర్చ జరగాల్సి ఉందన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరాకే తర్వాతి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు మంత్రి బొత్స. పీఆర్సీ జీవో పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. మెరుగైన పీఆర్సీ ఇచ్చామని, ఉద్యోగులు ఆశించినంత ఇవ్వలేకపోయామన్నారు. సహాయనిరాకరణ, సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలని ఉద్యోగులను కోరినట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాల సమస్యలను సరిదిద్దే ప్రయత్నం చేశామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పీఆర్సీపై అపొహలు తొలగించే ప్రయత్నం చేశామన్నారు. ఉద్యోగులు పాజిటివ్‌గా మాట్లాడారని చెప్పారు. ఇవాళ ఉద్యోగాలతో మరోసారి సమావేశమవుతామన్నారు.

మంచి వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు పీఆర్సీ సాధన సమితి నేతలు. ఉద్యోగుల ఆకాంక్షలను బలంగా వినిపించామన్నారు. సహాయనిరాకరణ కార్యక్రమం యదావిధిగా కొనసాగుతుందన్నారు. పూర్తి స్థాయి చర్చల తర్వాత ఫలితాన్ని బట్టి....ఆందోళనలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. మరికొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు.

ఇక సమావేశంలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే ఖర్చులకు 25 వేలు ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకరించింది. ఐఆర్‌ను వేతనాల నుంచి రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. సిటీ కంపన్సెటరీ అలవెన్సు పునరుద్ధరణ చేసే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రుల కమిటీ స్టీరింగ్ కమిటీకి చెప్పింది. HRA శ్లాబుల్లో మార్పులకు మంత్రులు అంగీకరించారు. అడిషనల్ క్వాంటమ్ పింఛను, తదితర అంశాల్లో మార్పులకు కేబినెట్‌ కమిటీ ఓకే చెప్పింది. రెండు లక్షల వరకు జనాభా ఉంటే 12 శాతం HRA, 5 నుంచి 15 లక్షల మధ్య జనాభా ఉంటే 16 శాతం, 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న చోట 24 శాతం HRAను మంత్రుల కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో పాటు అదనపు క్వాంటం పింఛన్‌లో 70 ఏళ్ల వారికి 5 శాతం, 75 ఏళ్ల వారికి పది శాతం ఇస్తామని మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. సీపీఎస్ రద్దుపై మరో మంత్రి వర్గ ఉపసంఘం చర్చిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పింది మంత్రుల కమిటీ. దీనికోసం మరికొంత సమయం కావాలని ఉద్యోగ సంఘాలను కోరింది.

మంత్రుల కమిటీ ప్రతిపాదనలపై అంతర్గతంగా చర్చించుకున్న నేతలు...మంత్రులతో మరోసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మంత్రుల కమిటీ ఎదుట పలు ప్రతిపాదనలుంచారు. పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని కోరారు. కనీసం 27 శాతానికి తగ్గకుండా 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని, HRA పాత శ్లాబ్‌ రేట్లనే కొనసాగించాలని కోరారు. 70 ఏళ్ల పింఛనర్లకు అదనపు క్వాంటమ్ పది శాతం, 75 ఏళ్ల పింఛనర్లకు అదనపు క్వాంటమ్ 15 శాతం ఇవ్వాలన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస టైమ్ స్కేల్ ఇవ్వాలని, గ్రామ సచివాలయ సిబ్బందికి అక్టోబర్ నుంచి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బందికి 2022 పీఆర్సీ స్కేల్ ఇవ్వాలన్నారు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు. మార్చి 31లోగా సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీతో చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story