CBN: చంద్రబాబు ములాఖత్‌లపై కోత

CBN: చంద్రబాబు ములాఖత్‌లపై కోత
భగ్గుమన్న కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు... జైళ్ల శాఖ డీఐజీకి వినతి పత్రం

రాజమండ్రి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లీగల్ ములాఖత్ తగ్గించడంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం, భద్రతపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.... రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. ఇప్పటిదాకా సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు రెండుసార్లు న్యాయవాదులతో లీగల్ ములాఖత్‌లు బంధువులు, స్నేహితులకు వారానికి రెండు సార్లు చొప్పున జైలు అధికారులు అనుమతించారు. తాజాగా లీగల్ ములాఖత్‌లపై కోత పెడుతూ రోజుకు ఒక్కసారికే పరిమితం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన, భద్రతా కారణాలతో పాటు న్యాయవాదులు జైలులోకి ఇంటర్వ్యూకు వచ్చే సమయంలో... స్నేహ బ్లాక్, పరిపాలన బ్లాక్ వద్ద ఖైదీలు, సిబ్బంది కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు జైలు అధికారులు చంద్రబాబు తరఫు న్యాయవాదులకు తెలిపారు. న్యాయవాదుల ములాఖత్‌పై ఆంక్షలు విధించడంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు.


చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల హెల్త్ బులెటిన్, జైలులో భద్రత, లీగల్ ములాఖత్‌లపై ఆంక్షలు తొలగించాలంటూ టీడీపీ నేతలు జైళ్ల శాఖ డీజీ హరీష్ కుమార్ గుప్తాకు వినతిపత్రం ఇంచ్చేందుకు యత్నించారు. రాజమండ్రి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్మించే పెట్రోల్ బంక్ శంకుస్థాపన కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత ఇతర నాయకులతో కలిసి డీజీ హాజరవ్వాల్సి ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, జోగేశ్వరరావుతో పాటు 12 మంది నేతలు శంకుస్థాపన కార్యక్రమం వద్దకు వెళ్లారు. టీడీపీ నాయకులు వచ్చారని తెలిసి అధికారపక్ష నేతలు, అధికారులు శంకుస్థాపన కార్యక్రమం వద్దకు రాలేదు. అక్కడే సుమారు గంట సేపు తెలుగుదేశం నేతలు వేచి ఉన్నారు. స్థానిక MLAనైనా... తన పేరు శిలాఫలకంపై వేయలేదని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ తర్వాత జైళ్ల శాఖ కోస్తా ఆంధ్ర డీఐజీ రవికిరణ్ కు ఫోన్ చేసి అనుమతి తీసుకున్న టీడీపీ నేతలు ఆయన కార్యాలయంలో కలిసి చంద్రబాబుకు సంబంధించిన తాజా అంశాలపై చర్చించారు. ఆరోగ్యం, భద్రతతోపాటు ఇప్పటివరకు ఇస్తున్న రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లు తొలగింపుపై డీఐజీతో మాట్లాడారు. చంద్రబాబుపై ఇప్పటికే ఉన్న కేసులతో పాటు ప్రభుత్వం కొత్త కేసులు పెడుతోందని ఏసీబీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వివిధ అంశాలపై పిటిషన్లు వేసి చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారని చెప్పారు. క్లయింట్‌గా న్యాయవాదులు చంద్రబాబుతో సంప్రదింపులు జరపాల్సి ఉందని నిబంధనలు, పరిపాలన అంశాలని సాకు చూపి లీగల్ ములాఖత్‌లో కోత పెట్టవద్దని విజ్ఞప్తి చేసి వినతిపత్రం అందించారు. టీడీపీ నేతల విజ్ఞప్తులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఐజీ రవికిరణ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story