CM Chandrababu : అధికారులు కార్పెట్ కల్చర్ మానుకోండి.. బాబు హితవు

పోలవరం ఎడమకాల్వ పనుల పరిశీలనలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజల ఆదాయం పెంచే మార్గం చూస్తామనీ.. స్కిల్ గణన చేసి యువతలో నైపుణ్యం పెంచేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి అందిస్తున్నామనీ.. తాను, పవన్ కళ్యాణ్, మోదీ చెప్పిన మాటలను ప్రజలు నమ్మి విశ్వసించారని అన్నారు.
నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామన్న చంద్రబాబు. సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు అందించామనీ.. నాటి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని చెప్పిందని గుర్తుచేశారు. "పెంచిన పింఛన్లు ఇస్తూనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాం. మాపై అభిమానం అనే పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ప్రజలు కూడా నేతలకు సహకరించాలి. మీ శ్రేయస్సే మా అభిమతం, నవ్వినా కొట్టే వ్యక్తి మొన్నటిదాకా పాలించారు. మీరంతా సంతోషంగా ఉండాలి.. మీ సంతోషం కోసం మేము పని చేస్తాం." అని బాబు అన్నారు.
"గత ముఖ్యమంత్రి ఎక్కడికైనా వస్తే చెట్లు నరికి, పరదాలు కట్టి, షాపులు మూయించేవారు. ఇక్కడ అధికారులు కార్పెట్లు వేశారు.. ఇక్కడికి రాజులు రాలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఈ కార్పెట్ కల్చర్ అధికారులు వదలాలి. అందరం మట్టిలోనే పుట్టాం.. చనిపోయినా మట్టిలోకే పోతాం. ఆడంబరాలు అవసరం లేదు.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తే చాలు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తాం." అని సీఎం చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com