BRAHMANI: దేవాన్ష్‌ చదివినా తప్పనే అంటాడు: నారా బ్రాహ్మణి

BRAHMANI: దేవాన్ష్‌ చదివినా తప్పనే అంటాడు: నారా బ్రాహ్మణి
చంద్రబాబు అరెస్ట్‌పై మండిపడ్డ నారా బ్రాహ్మణి... కక్ష సాధింపే అని ఆవేదన..

తెలుగు ప్రజల కోసం జీవితాన్నే అర్పించిన వ్యక్తిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం దారుణమని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజని ఆమె అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారంటూ రాజమహేంద్రవరంలో మహిళలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళల కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణీ పాల్గొన్నారు. తిలక్ రోడ్డులోని ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. J.N.రోడ్డు మీదుగా రామాలయం కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు.


చంద్రబాబు నాయుడి అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయన నేపథ్యంలో చంద్రబాబు యాత్రలకు, నారా లోకేష్‌ పాదయాత్రకు పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదారణ చూసి భయపడే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు వేసిందని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. 8 ఏళ్ల తన బాబు దేవాన్షన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ను చదివినా ఇందులో సాక్ష్యం ఎక్కడుందని ప్రశ్నిస్తారంటూ బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారంటూ ఆమె విరుచుకుపడ్డారు. లోకేష్‌ను కూడా నేడో, రేపో అరెస్టు చేయాలని చూస్తున్నారని.. తప్పుచేయని తాము ఎవరికీ భయపడమని తేల్చి చెప్పారు.


తమ వెనక 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, టీడీపీ కుటుంబం ఉందన్న నారా బ్రాహ్మణి, తమలో పోరాట స్ఫూర్తి ఉందని, న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడని, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విజనరీ ఆయన సొంతమని నారా బ్రాహ్మణి గుర్తు చేశారు. నీతి నిజాయితీగా తెలుగు ప్రజల కోసం కష్టపడిన అలాంటి నాయకుణ్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా కాకుండా, ఒక సాధారణ మహిళగా ఆయన అరెస్టును తీవ్రంగా గర్హిస్తున్నానని బ్రాహ్మణి అన్నారు.


చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడికే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో తెలుగు ప్రజలే ఆలోచించాలని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు లేకపోతే యువతీ యువకులకు నైపుణ్యం, ఉద్యోగాలు వచ్చేవా.. అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా... అని ఆమె ప్రశ్నించారు. వచ్చే వారంలో చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story