AP: ఐరాసలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి

AP: ఐరాసలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి
X
పర్వతనేని హరీశ్‌కు అరుదైన గౌరవం.... త్వరలో బాధ్యతల స్వీకరణ

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఆయన 1990 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం జర్మనీకి భారత రాయబారిగా పని చేస్తున్నారు. హరీశ్‌ విశాఖలో జన్మించి... విజయవాడలో పెరిగారు. జీ20, జీ7, బ్రిక్స్‌ సమావేశాల్లో కీలక పాత్ర పోషించారు. ఉప రాష్ట్రపతికి ఓఎస్‌డీగా కూడా పని చేశారు. రుచిర కాంభోజ్‌ జూన్‌లో పదవీ విరమణ చేయడంతో హరీశ్‌ను ఈ పదవిలో నియమించారు. రుచిర దాదాపు నాలుగు దశాబ్దాలపాటు దౌత్యవేత్తగా పని చేశారు. పర్వతనేని హరీశ్‌ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. గోల్డ్‌ మెడల్‌ కూడా పొందారు.


భారత విదేశాంగ సర్వీసు అధికారులకు గొప్ప అవకాశంగా భావించే ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి స్థాయికి ఎదిగిన పర్వతనేని హరీశ్‌ విశాఖపట్నంలో జన్మించారు. విజయవాడలో పెరిగారు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం విజయవాడ పటమటలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌లో సాగింది. లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించారు. డిగ్రీ అనంతరం కోల్‌కతా ఐఐఎంలో మేనేజ్‌మెంట్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 1990లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై.. భారత విదేశాంగ శాఖలో చేరారు. ఆయన తండ్రి పి.ఎస్‌.వి.ప్రసాద్‌ 1968వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. అంతకుముందు ఆయన హైదరాబాద్‌ ఐపీఎస్‌ శిక్షణ అకాడమీ అదనపు డైరెక్టర్‌గానూ పనిచేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చెందారు. హరీశ్‌ సతీమణి పేరు నందిత. బ్రిటిషర్ల కాలంలో ఉన్న సెంట్రల్‌ ప్రావిన్స్‌-బెరార్‌కు ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, వైస్‌రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా పనిచేసిన ఈడ్పుగంటి రాఘవేంద్రరావు మనుమరాలే నందిత.

కైరో, రియాద్‌లోని భారతీయ మిషన్స్‌లో హరీశ్‌ సేవలందించారు. గాజా సిటీలోని పాలస్తీనియన్‌ అథారిటీలో భారతదేశ ప్రతినిధిగా పనిచేశారు. పాలస్తీనియా కాందిశీకులకు ఐరాస చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. తర్వాత తూర్పు ఆసియా, విదేశాంగశాఖలోని ఎక్స్‌టర్నల్‌ పబ్లిసిటీ డివిజన్స్‌లో పనిచేశారు. 2007 నుంచి ఐదేళ్లు అప్పటి భారత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి సంయుక్త కార్యదర్శిగా, ఓఎస్‌డీగా సేవలందించారు. 2012 నుంచి 2016 వరకు దక్షిణ, వాయవ్య అమెరికాలోని రాష్ట్రాలకు సంబంధించి హ్యూస్టన్‌లో ఉన్న భారత కాన్సులేట్‌లో కాన్సుల్‌ జనరల్‌గా పనిచేశారు. 2016-19 మధ్య వియత్నాంలో భారత రాయబారిగా వ్యవహరించారు.

Tags

Next Story