TDP-JANASENA: టీడీపీ-జనసేన నేతల సంబరాలు

TDP-JANASENA: టీడీపీ-జనసేన నేతల సంబరాలు
X
పొత్తు ప్రకటనతో సంబరాలు చేసుకున్న ఇరు పార్టీల నేతలు

తెలుగుదేశం- జనసేన పొత్తు ఇరుపార్టీల నేతల్లో నూతనోత్సహం నింపింది. జనసేనతో పొత్తును తెలుగుదేశం నేతలు స్వాగతించారు. రాక్షస సంహారం కోసం శక్తులన్నీ ఒక్కటయ్యాయని ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. పవన్ ప్రకటన అనంతరం కడపలో ఇరుపార్టీల నాయకులు సంబరాలు చేసుకున్నారు. కడపలోని NTR సర్కిల్ వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమై సంబరాలు చేసుకున్నారు. ఇరువురు నాయకులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


తెలుగుదేశం- జనసేన పొత్తు ప్రకటనతో ఇరు పార్టీల నేతలు సంబరాల్లో మునిగితేలారు. పవన్ ప్రకటన అనంతరం కేక్‌ కట్‌ చేసి బాణాసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ఇరుపార్టీల నేతలు తెలిపారు. పొత్తులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. కమిటీ ఏర్పాటు చేసుకుని అందుకు తగ్గట్టుగా ఐక్య కార్యాచరణ ప్రకటించుకుంటామని వెల్లడించారు.

జగన్‌లాంటి దుర్మార్గుడిని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులు కలిసి రావాలన్నారు. పవన్‌ ప్రకటన వైసీపీలో ప్రకంపనలు సృష్టించిందని తెలుగుదేశం నేతలు అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచి పవన్ నిజజీవితంలోనూ హీరోగా నిలిచిపోయారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొనియాడారు. పవన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పబోతున్నాయని జనసేన నేతలు అన్నారు. వైకాపా అరాచకాలు పెచ్చుమీరడంతోనే ఒకే వేదికపైకి వచ్చి పోరాడాల్సి వస్తుందన్నారు.

నెల్లూరులోనూ ఇరుపార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వైకాపా అరాచక పాలనకు మరో 6నెలల్లో ప్రజలు చరమగీతం పాడనున్నారని జనసేన నేత మూర్తియాదవ్ అన్నారు. తెలుగుదేశం- జనసేన పొత్తుతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం రెట్టింపయ్యింది. NTR జిల్లా తిరువూరులో ఇరుపార్టీల నాయకులు కలిసి సంయుక్తంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి సంతోషాన్ని చాటుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పవన్ ప్రకటనపై మాజీమంత్రి పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. వైకాపా రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు కలిసిరావడం సంతోషించదగ్గ విషయమన్నారు. రెండు పార్టీల కలయిక రాష్ట్ర ప్రజల కోసమే తప్ప రాజకీయాలకు తావులేదన్నారు.

Tags

Next Story