PAWAN: పొత్తుపై వ్యతిరేక వ్యాఖ్యలను సహించను
జనసేన-తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా వారిని వైసీపీ కోవర్టులు భావిస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పొత్తు నిర్ణయం నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటే వైసీపీలోకి వెళ్లిపోవచ్చని పవన్ కల్యాణ్ కరాఖండీగా చెప్పేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్... జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ, జనసేన పొత్తు, భవిష్యత్తు కార్యాచరణ, సంయుక్త పోరాటం అంశాలపై జనసేనాని మాట్లాడారు. కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్ కల్యాణ్‌కో తూట్లు పొడిచినట్లు కాదని.... ఏ ప్రజల కోసం మనం పాటు పడుతున్నామో దానికే తూట్లు పొడిచినట్లని జనసేనాని స్పష్టం చేశారు. అవివేకంతోనో, అజ్ఞానంతోనో ఈ పొత్తు నిర్ణయం తీసుకోలేదన్న పవన్ కల్యాణ్... పొత్తు ఈ పరిస్థితులు ఆవశ్యకరమన్నారు.
దశాబ్ద కాలంపాటు ఎవరున్నా లేకపోయినా పార్టీని నడిపిన వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలుగు ప్రజల కోసమే అని నమ్మాలని పవన్ అన్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు తనను అర్థం చేసుకుంటారని.. కానీ తాను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోరని లోపం ఎక్కడుందని పవన్ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో తనకు ఉన్న దృష్టి, మనవాళ్లకు ఎందుకు అర్థం కాదని.. మోదీ అంతటి వ్యక్తి అర్థం చేసుకుంటే ఇక్కడి కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. తన నిర్ణయాలను సందేహించేవారు వైసీపీలోకి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సీరియస్‌గా తీసుకుంటానని... తాను మొండి వ్యక్తిని, భావజాలాన్ని నమ్మినవాణ్నని.. రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ బతిమాలరని ఘాటుగా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రధాని మోడీ మనకు అండగా ఉంటారని హామీ ఇచ్చారని, ఏ పొత్తయినా 70 శాతమే ఏకాభిప్రాయం ఉంటుందని, మరో 30 శాతం భిన్నాభిప్రాయాలపై చర్చలతో ఒక అంగీకారానికి వచ్చి ముందుకెళ్లాల్సిందే అని పవన్ అన్నారు. మన పొత్తుతో ఏర్పడ్డ ప్రభుత్వంలో జనసేన ప్రజల డిమాండ్లు నెరవేర్చగలదని, బీజేపీ నాయకులు వచ్చి తెలంగాణలో మనతో పొత్తు పెట్టుకున్నారంటే వాళ్లు తగ్గారని కాదని... మన అవసరాన్ని గుర్తించారని తెలిపారు. జగన్ లక్ష కోట్లు దోచేసిన దోపీడీదారుడని.. ఆయన దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమే ఇదని పవన్ చెప్పారు. పదేళ్లపాటు జగన్ రాజకీయాల వైపు చూడకుండా జనసేన ప్రయత్నిస్తుందని తెలిపారు. ఎందుకు ఒంటరిగా పోటీ చేయరని తనను జగన్ పదే పదే ప్రశ్నిస్తుంటారని.. ఆయన ఒక మహానుభావుడై ఉంటే అలా ఒంటరిగా పోటీ చేసేవాళ్లమని, ఆయనొక ప్రజాకంటకుడని వ్యాఖ్యానించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com