PAWAN: 2024లో వైసీపీని కూలగొడతాం: పవన్‌

PAWAN: 2024లో వైసీపీని కూలగొడతాం: పవన్‌
మద్యపాన నిషేధం ఏమైంది... రోడ్లెయ్యని జగన్ ఓట్లు ఎలా అడుగుతారు..

జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున వైసీపీ నేతలు వారి ఇళ్లల్లో ఉండగలరా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. నాలుగోవిడత వారాహి విజయయాత్రను గురువారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి బహిరంగసభతో పవన్‌ ముగించారు. కిక్కిరిసిన ప్రజా సందోహం మధ్య ఉద్వేగంగా మాట్లాడిన జనసేనాని, జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ను కూడా వైసీపీ నేతలు అన్యాయంగా తిట్టారని పవన్‌ గుర్తు చేశారు. నటుడు సూర్య ఫ్లెక్సీతో సభకు హాజరైన అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు దారి వెంబడి స్వాగతం పలికిన పలువురు తెలుగు సినీ హీరోల అభిమానులకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు.


టీడీపీతో పొత్తు ప్రకటించినప్పటి నుంచి జనసేన NDA కూటమి నుంచి బయటికి వచ్చేసిందని వైసీపీ ప్రచారం ప్రారంభించిందని పవన్‌ అన్నారు. జనసేన అంటే వైసీపీ భయపడుతోందంటే బలహీనపడినట్లేనని ఎద్దేవా చేశారు. జనసేన ఎన్‌డీఏ కూటమిలోనే ఉందన్న జనసేనాని... వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పోరాడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతిమార్గంలో నిలపాలన్న దృఢనిశ్చయంతోనే టీడీపీతో ప్రయాణం చేస్తున్నామని పవన్‌ స్పష్టం చేశారు. 2024లో బీజేపీ నేతృత్వంలో టీడీపీతో కలిసి వైసీపీను కూలగొడతామని పవన్‌ తేల్చిచెప్పారు. టీడీపీ నాయకులు.. జనసేన నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని పవన్‌ సూచించారు.


మద్యపానం పూర్తిగా నిషేధిస్తానని జగన్‌ హామీ ఇచ్చి ఇప్పుడు కల్తీ, నాసిరకం మద్యం అమ్మి ఆడపడుచుల పుస్తెలు తెంపుతున్నారని పవన్‌ మండిపడ్డారు. టీడీపీ -జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత గల మద్యం పాత ధరలకే అమ్మేలా కొత్త విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మద్యపానం వద్దన్న గ్రామాలకు అదనపు నిధులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామన్న జనసేనాని.. ప్రశ్నించిన వారిపై కైకలూరు ఎమ్మెల్యే, ఆయన కుమారుడు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కనీసం రోడ్లు కూడా వేయకుండా ప్రజలకు ఓట్లు ఎలా అడుగుతావ్‌ జగన్‌ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘హిందూ దేవుళ్లను సనాతన ధర్మం పేరుతో తిడుతుంటే బాధగా ఉందన్న పవన్‌. రాష్ట్రంలో 219 దేవాలయాలు కూల్చేశారని, రథాలు తగలపెడుతున్నారని, కనకదుర్గమ్మ ఆలయంలో వెండిసింహాలు మాయమైనా ఇప్పటివరకూ జగన్‌ ఎందుకు మాట్లడలేదని పవన్‌ నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story