PAWAN: కూటమిదే అధికారం
క్రోది నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో.. పవన్ పాల్గొని...పంచాంగ పఠనాన్ని ఆలకించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు వర్మతోపాటు జనసేన నేతలు పాల్గొనగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని.. చేబ్రోలులో పవన్ కల్యాణ్ నూతన గృహప్రవేశం చేశారు. అనంతరం కూటమి ముఖ్యనేతలు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశమైన పవన్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. వచ్చేవారం నియోజకవర్గంలో మండలాలవారీగా ప్రచారం చేస్తానన్న పవన్ ...ఆ మేరకు.... రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు.
రఘురామ ధీమా
టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ... అరాచకశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ్నించి పోటీ చేసినా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, జగన్ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో పవన్ కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మెగా ఆశీస్సులు....
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా ప్రచారంలోకి పూర్తి స్థాయి చేయకున్నా తెర వెనుక సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అన్న మెగాస్టార్ చిరంజీవిని కలిసి పవన్ కల్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు.
చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' షూటింగ్ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో కొనసాగుతోంది. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి సోమవారం ఉదయం నాగబాబుతో కలిసి పవన్ కల్యాణ్ వెళ్లారు. రాజకీయ యుద్ధం చేస్తున్న తమ్ముడిని చిరంజీవి ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం చిరంజీవి ఆశీర్వాదం పవన్ పొందారు. పార్టీ స్థాపించి పదేళ్ల తర్వాత రాజకీయంగా చిరంజీవితో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు సోదరులు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com