PAWAN: పంచభూతాలకు పార్టీ రంగులు

PAWAN: పంచభూతాలకు పార్టీ రంగులు
మండిపడిన జనసేనాని పవన్‌కల్యాణ్‌.... ఏపీలో ఉన్నది ఆటవిక రాజ్యమన్న లోకేశ్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఎస్టీ మహిళ సామినిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచివేసిందన్నారు. తాగు నీరడిగితే చంపేస్తారా అని ఓ ప్రకటనలో పవన్ ప్రశ్నించారు. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లను అడ్డుకోవడమేంటని తాగునీటికి కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి దురదృష్టకరమని ఆక్షేపించారు. ఈ దురాగతంపై అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల క్రితం పల్నాడులో ఎస్టీ మహిళను చంపేశారని పవన్ గుర్తు చేశారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసేవారిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వెనకేసుకొచ్చే వారికి..నా ఎస్సీ, నా ఎస్టీ అనే అర్హత ఉందా అని జనసేనాని నిలదీశారు.


దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో.. తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళను వైకాపాకి చెందిన స్థానిక నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. వారం రోజులుగా.. గుక్కెడు నీరు దొరకని పరిస్థితుల్లో ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను తెలుగుదేశం పార్టీకి చెందిన వారంటూ బెదిరించడమేంటని లోకేశ్ ప్రశ్నించారు.తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే గిరిజన మహిళ చేసిన నేరమా అని నిలదీశారు. వైకాపాకు చెందిన సైకో ఊరంతా చూస్తుండగా ట్రాక్టర్ తో తొక్కించి మహిళను చంపేస్తే డ్రైవింగ్ రానందునే ప్రమాదం జరిగిందని కేసు కట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు నిదర్శనమని లోకేశ్ ధ్వజమెత్తారు.

వైసీపీ ముగింపు దగ్గరలోనే ఉందని ఓడిపోవడానికే జగన్ సిద్ధం అంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. ఎంపీతో పాటు నెల్లూరు వైకాపా కార్పొరేటర్లు, సర్పంచులను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన-తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే జగన్ కు నిద్రపట్టట్లేదని ఎద్దేవా చేశారు. మాజీమంత్రి వివేకహత్యపై సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆఖరుకు సొంత చెల్లెలు పుట్టుకపైనా నీచంగా విమర్శలు చేస్తుంటే జగన్ ఖండించడంలేదన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్-క్విట్ జగన్ నినాదాన్ని... ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story